ఆంధ్రప్రదేశ్ కు వేరుగా రిజిస్ర్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌ఓసీ) కార్యాలయం ప్రారంభం కానుంది. నిన్న కాక మొన్న మన అమరావతిలో హైకోర్ట్ ఏర్పాటు పై నోటిఫికేషన్ రాగా, ఇప్పుడు ప్రత్యెక ఆర్‌ఓసీ పై కూడా నోటిఫికేషన్ వచ్చింది. విజయవాడలోని సూర్యారావుపేటలో తాత్కాలిక కార్యాలయాన్ని జనవరి ఒకటిన ప్రారంభించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యాలయం ఏర్పాటుకు ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి హైదరాబాద్‌లోని ఆర్‌ఓసీ కార్యాలయం సేవలు అందిస్తోంది. హైదరాబాద్ ఆర్‌ఓసీలో రిజిస్ర్టార్‌గా పని చేస్తున్న డెన్నింగ్ కె బాబు ఏపీ ఆర్‌ఓసీ కార్యాలయానికి బదిలీ అయ్యారు.
సాయి శంకర్ లండ సహాయ రిజిస్ర్టార్ ఆఫ్ కంపెనీ్‌సగా బాధ్యతలు నిర్వహిస్తారు. అమరావతిలో సొంత భవనం నిర్మాణం అయ్యే వరకు ఏపీ ఆర్‌ఓసీ కార్యాలయం విజయవాడలో ఉంటుంది.. ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలలో కంపెనీల ఏర్పాటు, పర్యవేక్షణ సులభతరం అవుతుంది. రాష్ట్రంలోని కంపెనీల డైరెక్టర్లు, ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీలు, చార్టర్డ్ అకౌంటెంట్లకు వెసులుబాటు లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 2018 డిసెంబరు నాటికి 29,735 కంపెనీలు ఉన్నాయి. ఇందులో 1,509 లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్‌షిప్ (ఎల్‌ఎల్‌పీ) కంపెనీలు. మొత్తం కంపెనీల్లో 18,436 కంపెనీలు, 1,291 ఎల్‌ఎల్‌పీలు చురుగ్గా పని చేస్తున్నాయని ఆర్‌ఓసీ వర్గాలు తెలిపాయి.
ఇటీవలి కాలంలో ఏపీలో ఎక్కువ కంపెనీలు నమోదవుతున్నాయని, గత మూడు నెలల్లో ప్రతి నెలా సగటున 1,000 కంపెనీల నమోదు జరిగిందని పేర్కొన్నాయి. కేరళలోని కొచ్చిన్‌కు చెందిన డెన్నింగ్ కె బాబు 2011 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ (ఐసీఎల్‌ఎస్) అధికారి. సహాయ రిజిస్ర్టార్ ఆఫ్ కంపెనీస్ సాయి శంకర్‌ది విజయనగరం జిల్లాలోని కొవ్వాడపేట గ్రామం. తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్ సర్వీసెస్ ద్వారా ఇండియన్ కార్పొరేట్ లా సర్వీ్‌సకు ఎంపికైనా తొలి వ్యక్తి. మొత్తానికి హైదరాబాద్ లో మిగిలిపోయినవి అన్నీ ఒక్కొక్కటి మన అమరావతికి వచ్చేస్తున్నాయి. ఇక విభాజన చట్టంలో ఉన్న ఉమ్మడి ఆస్థుల విభజన కూడా అయిపోతే, ఇక మన రాష్ట్రంలో, అన్ని శాఖలు వచ్చేస్తాయి.