జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ అధ్యక్షుడు, విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. "పవన్ కల్యాణ్ ఆరు నెలలకోసారో ఏడాదికోసారో బయటకు వస్తాడు. ఒకరోజు ఒక ట్వీటిస్తాడు. లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో మాట్లాడడం మొదలు పెడితే, దాని గురించి కూడా మనం సమాధానం చెప్పాలంటే, నిజంగా ఎక్కడివీ విలువలు!? విలువల గురించి తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండీ తనకు విలువలు? నలుగురు నలుగురు పెళ్లాలు. కొత్త కారును మార్చినట్టు పెళ్లాన్ని మారుస్తాడు. నాలుగేళ్లకోసారి ఐదేళ్లకోసారి పెళ్లాన్ని మారుస్తాడు. ఇలాంటి పనిని నేనో నువ్వో మరొకరో చేసి ఉంటే.. ఏమందురు!? నిత్య పెళ్లికొడుకని చెప్పి జైల్లో వేసేవారా కాదా!? ఇది పాలిగామీ (బహు భార్యత్వం) కాదా? ఇలాంటోళ్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీలుడినని మాట్లాడడం.. వాళ్లను సీరియ్‌సగా తీసుకుని వాళ్ల గురించి కూడా విశ్లేషించుకోవడం అంటే బాధేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
అయితే ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపాయి. ఇప్పటి వరకు ఎన్నో వ్యక్తిగత విమర్శలు చూసినా, ఇలా మరీ ఓవర్ గా ఎవరూ చేయలేదు. దీని పై వైసీపీ నేతలు రెండు కారణాలు చెప్తున్నారు. మంగళవారం తను పిలుపు ఇచ్చిన బంద్ సక్సెస్ కాకపోవడంతోనే జగన్ ఈ స్థాయిలో వ్యాఖ్యానించారని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. బంద్‌ను విజయవంతం చేయకపోవడంపై సొంత పార్టీ నేతలను తీవ్రంగా నిలదీసినట్టు సమాచారం. దీనికి తోడు ప్రెస్ మీట్ చివరలో పవన్ కల్యాణ్ గురించి అడగడంతో జగన్ కంట్రోల్ తప్పారని.. అందుకే అలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
మరో కారణం, పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలతో జగన్ ఇగో దెబ్బతిందని, పవన్ లాంటి వాడు నన్ను ప్రశ్నిస్తాడా అనే జగన్ అంటున్నారు అని వైసిపీ నేతలు అంటున్నారు. రెండు రోజుల క్రితం పవన్ మాట్లాడుతూ, ‘‘జగన్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆగాలని చెప్పడమే తప్ప... ప్రజా సమస్యలపై ఆయన పోరాడటం లేదు. బంగారంలాంటి అవకాశాలను వినియోగించుకోవడంలేదు. నేను ఉండి ఉంటే... అసెంబ్లీలో వైసీపీలాగా పారిపోయేవాడిని కాదు. ఈరోజు రోడ్లమీద కూర్చుని పోరాడాల్సి వస్తోంది. కానీ, నాకు పది మంది సభ్యులు ఉంటే సభను ఆపేసేవాడిని. ఇంత బంగారంలాంటి అవకాశాన్ని జగన్ దుర్వినియోగం చేశారు.’ అని అన్నారు.