నిన్న నిజామాబాద్ లో జరిగిన మీటింగ్ లో, కెసిఆర్, చంద్రబాబు పై ఎలాంటి పదజాలం ఉపయోగించారో అందరూ చూసారు. ఒకింత ఆశ్చర్యపోయారు కూడా. అసలు చంద్రబాబు, నేను తెలంగాణాలో ప్రచారానికి కూడా రాను అని తేల్చి చెప్పితే, కెసిఆర్ మాత్రం తన పాలన పై కాకుండా, చంద్రబాబుని బూచిగా చూపించి ఎన్నికలకు వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. అయితే, నిన్న కెసిఆర్ అలా రెచ్చిపోటానికి కారణం, నిన్న టిడిపి సమన్వయ కమిటీ మీటింగ్ లో, కెసిఆర్ పై చర్చ జరగటం, కెసిఆర్ - మోడీ కుమ్మక్కు గురించి మాట్లాడటం, అవి మీడియాలో పెద్ద ఎత్తన రావటంతో, కెసిఆర్ అది తట్టుకోలేక పోయినట్టు తెలుస్తుంది. చంద్రబాబు నెమ్మదిగా తన పై గురి పెడతాడని గ్రహించిన కెసిఆర్, ముందుగానే చంద్రబాబు పై ఎదురు దాడి చేసారు.
కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా నడుస్తున్నారన్న చర్చ టిడిపి సమన్వయ కమిటీ మీటింగ్ లో జరిగింది. తెరాసకి తెదేపా స్నేహహస్తం చాచినా కేసీఆర్ తోసిపుచ్చారని, దాని వెనుక మోదీ హస్తం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘మనం తెరాసని శత్రు పార్టీగా చూడలేదు. మనమంతా కలసి ఉంటే దక్షిణాదిలో బలమైన శక్తులుగా మారడంతో పాటు, మన హక్కుల్ని సాధించుకోగలమని భావించాం. రెండు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సఖ్యతగా ఉంటే బాగుంటుందన్న ప్రతిపాదన మేమే ముందుకు తెచ్చాం. తెలంగాణలో తెదేపా, తెరాస కలిస్తే రాజకీయంగా తిరుగుండదు. అలాంటి వాతావరణం ఉండాలని కోరుకున్న మమ్మల్ని కేసీఆర్ వద్దనుకున్నారు. భవిష్యత్తులో మోదీకి దగ్గరగా ఉండాలన్నది ఆయన భావన’’ అని ఒక మంత్రి వెల్లడించారు. భాజపా, వైకాపా, జనసేన కలసి కుట్ర పన్నుతున్నాయని, అజాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు తప్పవని, తెదేపాని దెబ్బతీసేందుకే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్న చర్చ జరిగింది.
తెలంగాణ ఏసీబీనే ఓటుకి నోటు కేసు దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు తెలుస్తోందని సమావేశంలో ఒక మంత్రి పేర్కొన్నారు. కేంద్రం ఆదేశాల మేరకే తెలంగాణలో ఐటీ దాడులు జరుగుతున్నాయని, ఏపీలోనూ ఇదే తరహా దాడులకు అవకాశం లేకపోలేదని మరో మంత్రి అన్నారు. సీఎంతో పాటు మంత్రులనూ టార్గెట్ చేసేలా కేంద్రం కుట్రలు పన్నుతోందన్న ప్రచారం జరుగుతోందని మరో మంత్రి పేర్కొన్నట్టు సమాచారం. తెలంగాణలో తెరాసకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడటాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్న మరో మంత్రి వ్యాఖ్యానించారు. ఏపీలో తెదేపాకి వ్యతిరేకంగా జగన్-పవన్‌ను కలిపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తారన్న ప్రచారం తెలంగాణలో జరుగుతోందని ఆయన తెలిపారు. అన్ని రకాల కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలను ఎదుర్కోవాలని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాజకీయంగా ఎదురయ్యే అన్ని సవాళ్లను అధిగమించి ప్రజాబలంతో ఎన్నికలకు వెళ్దామని ఆయన తెలిపారు.