తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వెళ్ళిపోవటం చాలా సాదాసీదాగా జరిగిపోయింది. ఆయన వెళ్లిపోతారని చాలాకాలంగా రాజకీయ వర్గాలు ఊహిస్తున్నదే కావడంతో ఈ వ్యవహారం పెద్దగా కలకలం కూడా కలిగించలేదు. ఎన్నికలకు బాగా ముందుగా ఆయన తనంతట తానే వెళ్లిపోవడం టీడీపీ నాయకత్వానికి కూడా ప్రశాంతత చేకూర్చింది. టీడీపీలో రావెల తారాజువ్వలా వేగంగా పైకెగిరి, అంతే వేగంగా కిందకు జారిపోయారు. నిజానికి ఆయన సతీమణి రావెల శాంతిజ్యోతి 2009 ఎన్నికల్లో గుంటూరు జిల్లా తాడికొండ (ఎస్సీ) స్థానంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో రావెల మొదట వైసీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. అక్కడ సాధ్యం కాకపోవడంతో ప్రత్తిపాడు నుంచి టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు.
ఐఆర్‌ఎస్ అధికారి అయిన ఆయన గతంలో లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి వద్ద పనిచేసి ఉండడంతో పాత నాయకులను పక్కనపెట్టి టీడీపీ అధినాయకత్వం ఆయనకు టికెట్ ఇచ్చింది. ఆయన అక్కడ విజయం సాధించారు. అనుభవం ఉన్న అధికారిగా పరిపాలనలో మంచి ఫలితాలు చూపిస్తారన్న అంచనాతో చంద్రబాబు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం వంటి పెద్ద శాఖలు ఇచ్చినా పనితీరు కనబరచలేకపోయారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలతో తగాదాలు నిత్యకృత్యంగా మారాయి.జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్‌తో బహిరంగంగానే గొడవపడ్డారు. ఈ కారణంగా తదుపరి విస్తరణలో చంద్రబాబు ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించారు.
అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న రావెల పార్టీలో అంటీముట్టనట్లుగా ఉంటూ వచ్చారు. టీడీపీ అంటే ఉప్పునిప్పుగా వ్యవహరించే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగతో చేయికలిపారు. చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఉన్న మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు దగ్గరయ్యారు. ఇలాంటి చర్యలతో ఆయనకు ప్రత్తిపాడులో మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని ప్రచారం జరిగింది. దాంతో రావెల వైసీపీలో చేరాలనుకున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను కలిశారు. ప్రత్తిపాడు నుంచే పోటీచేసే అవకాశమివ్వాలని కోరారు. అయితే ఆ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరితకే టికెట్ ఇస్తామని చెప్పడంతో.. బాపట్ల (ఎస్సీ) లోక్‌సభ స్థానం నుంచైనా అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. అక్కడ జగన్ కూడా కుదరదు అనటంతో, ఈయన వచ్చి పవన్ పక్కన చేరారు. పవన్ తో రావెల చేరటానికి ఇదే కారణం తప్ప, ఇంకా ఏమి లేదని, ఆయన వర్గం చెప్తుంది.