అరకులోయలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పై ఆదివారం మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే సర్వేశ్వరరావు కన్నుమూశారు. ఆయనతో పాటు ఉన్న మాజీ ఎమ్మెల్యే శివేరి సోమపై కూడా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన కూడా ప్రాణాలు విడిచారు. డుమ్రిగూడ మండలం లిపిట్టిపుట్టు వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. దాడిలో కిడారి అనుచరులు మరికొంతమందికి కూడా గాయాలైనట్టు సమాచారం.
కిడారికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిడారిపై దాడి జరిగినట్టు జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ నిర్ధారించారు. మావోయిస్టులు హిట్ లిస్టులో ఉన్న కిడారికి హెచ్చరికలు జారీ చేస్తూ గతంలో పోస్టర్లు వెలిశాయి. ఈ దాడిలో దాదాపు 50మంది మహిళ మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం. కిడారి, ఆయన అనుచరుల పై మావోయిస్టులు మాటువేసి దాడి చేశారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో మహిళా మావోయిస్టులు అతి సమీపం నుంచి వారిపై కాల్పులు జరిపారు. గతంలోనూ పలుసార్లు కిడారిని మావోయిస్టులు బెదిరిస్తూ వచ్చారు. దాడి అనంతరం మావోయిస్టులు ఎటువెళ్లారనే దానిపై పోలీసులు గాలింపు చేపట్టారు.
మరో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉండటంతో, సియంఓ అధికారులు అలెర్ట్, మొత్తం పర్యవేక్షిస్తున్నారు. విశాఖ కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి, పరిస్థితి సమీక్షిస్తూ, గ్రే హౌండ్స్ బలగాలను పంపిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులకు, పోలీసులకి సమాచారం ఇవ్వకుండా, బయటకు వెళ్ళవద్దు అంటూ సూచనలు ఇచ్చారు. విజయనగరంలో, జగన్ పాదయత్రలో భద్రత పెంచారు. డీజీపీ ఠాకూర్ విశాఖ బయలుదేరి వెళ్లారు. సంఘట జరిగిన ప్రాంతం అంతా పోలీసులు జల్లిడి పడుతున్నారు.