గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. ఆ తరువాత జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. నాలుగేళ్ల వైసీపీ పాలన పూర్తయ్యేసరికి వైసీపీ నేతలకు జగన్ పాలనపై మొహం మొత్తింది ఏమో, వైసీపీ అధినేత తీరు మారదని డిసైడయ్యారేమో అసంతృప్తి గళం వినిపించడం ఆరంభించారు. ఇది నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మొదలై, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి మీదుగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వరకూ పాకింది. వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగురవేసే వాళ్లని బుజ్జగించడం పద్ధతి మానేసి వేటేసే ఆట మొదలు పెట్టారు జగన్ మోహన్ రెడ్డి. నెల్లూరు నుంచి వైసీపీలో గెలిచినవాళ్లలో అత్యధికశాతం జగన్ రెడ్డి సామాజికవర్గం వారే. వీరిలో చాలా మంది టిడిపితో టచ్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. క్లీన్ స్వీప్ చేసిన జిల్లా నెల్లూరు నుంచి సొంత సామాజికవర్గ నేతలే వైసీపీని వీడిపోయేందుకు తహతహలాడుతూ ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడనున్నారని టాక్. అత్యధిక మెజారిటీతో గెలిచిన సొంత సామాజికవర్గం వారే జగన్ రెడ్డిపై అపనమ్మకంతో ఉంటే, అంటరానివారిగా జగన్ రెడ్డి చూసే ఇతర సామాజికవర్గాల వారు వైసీపీలో కొనసాగాలని ఎవరు అనుకుంటారు? అన్ని జిల్లాల నుంచీ అసంతృప్త నేతలు ఒక్కొక్కళ్లూ బయటకొచ్చి తమ గళం వినిపించేందుకు సిద్ధం అవుతున్నారని ప్రచారం సాగుతోంది. బిల్లులు కాలేదని ఒకరు, తమ నియోజకవర్గానికి నిధులు ఇవ్వలేదని మరొకరు, తన మనుషులకు పదవులు ఇవ్వలేదని ఇలా వైసీపీని టార్గెట్ చేసేందుకు సరైన సమయం వేచి చూస్తున్నారని తెలుస్తోంది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంటుంది. వైసీపీలో సంతృప్తిగా ఉన్న నేతలు లిస్టు తీస్తే జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, సజ్జలరెడ్డి మాత్రమేనని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
వైసీపీలో జగన్ `రెడ్డి నేతలు` తిరుగుబాటు..అదే బాటలో మరికొందరు
Advertisements