ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ రాకకు రంగం సిద్ధమవుతోంది. తిరుపతి విమానాశ్రయం సమీపంలో 150 ఎకరాల్లో ఈ సెజ్ ఏర్పాటు కానుంది. ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి ముగియగానే... ‘రిలయన్స్’ సంస్థ ఎలక్ట్రానిక్స్ సెజ్‌పై దృష్టి సారించనుంది. జనవరిలోనే ఈ సెజ్‌కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో ముకేశ్ అంబానీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ తదితరులు పాల్గొననున్నారు. రిలయన్స్ ఎలక్ర్టానిక్స్ సిటీ కోసం ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించింది. ఇందులో రిలయన్స్ సంస్థ సుమారు రూ.15వేల కోట్ల పెట్టుబడి పెడుతుంది. జియోఫోన్లు, సెట్‌టాప్ బాక్స్‌లతో పాటు రోజుకు దాదాపు పది లక్షల ఎలక్ట్రానిక్ వస్తువులు ఇక్కడ తయారవుతాయి.
ఈ ఒక్క సెజ్‌లోనే 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. గతంలో లోకేశ్ ముంబై వెళ్లి ముకేశ్ అంబానీని కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో సాధిస్తున్న పురోగతిని వివరించారు. ఈ ప్రతిపాదన పై ముఖేశ్ సానుకూలంగా స్పందించారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో రిలయన్స్‌తో ఎంవోయూ కూడా కుదిరింది. దీని పై తదుపరి చర్చలు కూడా జరిగాయి. జనవరిలో శంకుస్థాపన చేయాలనే నిర్ణయం జరిగింది. రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ సెజ్ రావడం కీలక పరిణామమని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ‘‘ఇప్పటికే దేశవ్యాప్తంగా తయారయ్యే ప్రతి వంద సెల్‌ఫోన్లలో 30 మన రాష్ట్రంలోనే తయారవుతున్నాయి. రిలయన్స్ క్లస్టర్ ప్రారంభించిన తర్వాత ఇది మరింత పెరుగుతుంది’’ అని చెబుతున్నాయి.
తిరుపతిలో ఎలక్ర్టానిక్ సెజ్ స్థాపిస్తున్న రిలయన్స్ సంస్థ అమరావతిలోనూ పెట్టుబడులు పెట్టనుంది. ఇక్కడ ‘రీసెర్స్ అండ్ డెవల్‌పమెంట్ సెంటర్ ఫర్ స్టార్ట్‌ప్స’ను ప్రారంభించే అవకాశాలున్నాయి. రిలయన్స్ కు సంబంధించిన ఒక ప్రధాన కార్యాలయంగా ఇది రూపొందనుంది. ఈ ప్రతిపాదన ఇంకా తుది రూపానికి రాలేదని... ఎలక్ర్టానిక్స్ సెజ్ ప్రారంభ సమయానికి ఈ సెంటర్‌పైనా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. మరోవైపు ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో ఐదు ఐటీ కంపెనీలు అమరావతికి రానున్నాయి. ఇందులో విజయవాడలో రెండు, మంగళగిరిలోని ఐటీ సెజ్‌లో మూడు ప్రారంభంకానున్నాయి. ఇవన్నీ చిన్న స్థాయి కంపెనీలే. అమెరికాలో కంపెనీలను నిర్వహిస్తున్న ప్రవాసాంధ్రులు వాటి శాఖలను ఇక్కడ కూడా ప్రారంభించనున్నారు.