ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీలు విజయం సాధిస్తాయన్న విషయాన్ని సీ-ఓటర్ సర్వే వెల్లడించింది. సర్వే వివరాల ప్రకారం.. తెలంగాణలో మజ్లిస్ తో కలిసి టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని, టీఆర్ఎస్ కు 16 సీట్లు, ఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదని అభిప్రాయపడింది. ఇక, ఏపీలో ‘సైకిల్’ జోరు ఉంటుందని, టీడీపీ ఆధిక్యత కనబరుస్తుందని పేర్కొంది. టీడీపీకు 14 సీట్లు, వైసీపీకు 11 సీట్లు వస్తాయని సీ-ఓటర్ సర్వే తెలిపింది. అయితే మొన్నటి దాక ఈ సర్వేలో జగన్ కు 22 ఎంపీ సీట్లు వస్తాయని ఊదరగొట్టారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ట్యూన్ మారుస్తున్నారు.
ఈ సర్వే పై చంద్రబాబు స్పందించారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో సీ ఓటర్ సర్వేలో తెలుగుదేశం పార్టీకి 14 ఎంపీ సీట్లు, వైసీపీకి 11ఎంపీ సీట్లు వస్తాయని వచ్చినట్లు పాత్రికేయులు చెప్పగా... ‘‘ ఏ ఊరెళ్లినా సైకిల్, తెలుగుదేశం అనే అంటారు. మా గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయి. ద్రోహులకు ఇక్కడ స్థానం లేదు. అభివృద్ధిని అడ్డుకునే వారిని రాష్ట్ర ప్రజలు సహించరు’’ అని తెలిపారు. పాతిక లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు.ఈ ఎన్నికలు ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినవని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘కేసీఆర్ పంచన చేరి, తెలంగాణకు ఊడిగం చేసే జగన్‌తో కాదు! జగన్‌ను ముందు పెట్టి ఆంధ్రపై పెత్తనం చేద్దామనుకుంటున్న కేసీఆర్‌తోనే పోటీ! కేసీఆర్ కావాలా? చంద్రబాబు కావాలా?’’ అని ప్రశ్నించారు. అసలు జగన్‌కు ఉన్న అర్హత ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన అవినీతి గురించి అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పేపర్ ప్రజెంట్ చేశారని తెలిపారు.
ఒకప్పుడు జేబుదొంగలు, ఆస్తి దొంగలు, గొలుసు దొంగలుండేవారని... ఇప్పుడు ఓట్ల దొంగలొచ్చారని చంద్రబాబు విమర్శించారు. ‘‘బిహార్‌లో కూర్చుని అక్కడి నుంచే కంప్యూటర్ ద్వారా ఇక్కడున్నవారి పేర్లతో ఓట్లు తీసేయాలంటూ ఫామ్-7దరఖాస్తులు పెట్టారు. ఇది ఎంత దుర్మార్గం! ఓటు లేకుంటే ఎన్నికలు లేవు. మీ ఓటు ఉందో లేదో ఇప్పుడే తనిఖీ చేసుకోండి. 15వ తేదీ వరకు ఓటుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు’’ అని తెలిపారు. ఫామ్-7 అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు, అదే సమయంలో జాతీయ స్థాయిలో ఏం చేయాలన్నదానిపై అన్ని పార్టీలతో మాట్లాడేందుకు త్వరలోనే ఢిల్లీకి వెళతానని చంద్రబాబు చెప్పారు.