దక్షిణ భారత దేశంలో కర్ణాటక తరువాత, బీజేపీకి కొంచెం బలం ఉన్నది తెలంగాణాలో. ఆంధ్రప్రదేశ్ లో అయితే బీజేపీకి నోటా కంటే తక్కువ వచ్చాయి. తమిళనాడులో ఇంకా ఘోరమైన పరిస్థితి. కేరళలో ఏదో ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టు పార్టీ ఉంది. కర్ణాటకలో అధికారంలో ఉంది. అయితే ఇప్పుడు కొద్దిగా బలం ఉన్న తెలంగాణా పై ఎదగటానికి బీజేపీ ఫోకస్ పెట్టింది. ఒక్క ఎమ్మెల్యే, నలుగురు ఎంపీలు బీజేపీకి తెలంగాణాలో ఉన్నారు. అయితే మొన్న జరిగిన దుబ్బాక ఎన్నికల్లో, టీఆర్ఎస్ కు చుక్కలు చూపించి, వెయ్యి ఓట్లతో దుబ్బాక గెలిచారు. మొత్తానికి ఒక సీట్ నుంచి, రెండు సీట్ లకు తెలంగాణాలో బీజేపీ ఎదిగింది. ఈ నేపధ్యంలోనే, వెంటనే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు వచ్చాయి. ఇంకేముంది, ఇక్కడ కూడా దుబ్బాక సీన్ రిపీట్ చేస్తాం అంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తే నాలుగు కార్పోరేటర్ సీట్లు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా మేయర్ స్థానం పైనే బీజేపీ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ లో హిందూ అజెండా తీసుకుని, గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఏదో మాటలు వరుకే కాకుండా, గట్టి ప్రయత్నాలే చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వచ్చారు. చార్జ్ షీట్ విడుదల చేసి ప్రచారం చేసారు. ఇక హైదరాబాద్ కాదు భాగ్యనగరం అంటూ కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కూడా హడావిడి చేసారు. వీరిద్దరూ ఇప్పటికే ప్రచారం పూర్తి చేసుకోగా, ఇప్పుడు మరి కొంత మంది నేతలను తెలంగాణా బీజేపీ నేతలు రప్పిస్తున్నారు. రేపు మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రచారానికి వస్తున్నారు. ఇక అలాగే ఉత్తర ప్రదేశ్ సియం యోగి ఆదిత్యనాథ్ ఈ నెల 27న వస్తారని, ఈ నెల 28న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వస్తారని, మరి కొంత మంది నేతల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు.
హైదరాబాద్ లో వివిధ రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం వచ్చి నివాసం ఉంటున్నారని, వారి ఓట్ల కోసం, బీజేపీ నేతలు వివిధ రాష్ట్రాల నాయకులను తీసుకుని వచ్చి ప్రచారం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో దాదాపుగా 10 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నుంచి మాత్రం ఒక్క నాయకుడుని కూడా తీసుకుని రావటానికి ,తెలంగాణా బీజేపీ నేతలు ఒప్పుకోలేదా ? అంటే అవును అనే, జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్ధం అవుతుంది. ఏపి బీజేపీలో సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, జీవీఎల్ తప్ప, మిగతా ఎవరూ కనిపించరు. వీరేమో జగన్ మోహన్ రెడ్డికి అనుకూలం అనే ప్రచారం ఉంది. జగన్, కేసీఆర్ స్నేహం అందరికీ తెలిసిందే. అందుకే తెలంగాణా బీజేపీ నేతలు, ఆంధ్రా బీజేపీ నేతలను దూరం పెట్టినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ఏపి బీజేపీ నేతలు అంటేనే మండిపడుతూ ఉంటారు. అలాంటిది వీరి వల్ల నష్టం తప్ప, లాభం లేదని, మొన్న ఒక ప్రముఖ ఛానల్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు, ఇప్పుడు నిజమే అనిపిస్తున్నాయి. మొత్తానికి ఇది ఏపి బీజేపీ నేతల పరిస్థితి. మరి ఇక్కడేమో ఏకంగా చంద్రబాబుని, జగన్ ని కొట్టేసి అధికారంలోకి వచ్చేస్తాం అని చెప్తున్నారు. చూడాలి వీళ్ళ ఆశలు ఎలా నెరవేరుతాయో. ప్రజలను ఎలా ఒప్పిస్తారో.