జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. అటు కేంద్రం నుంచి, ఇటు కోర్టుల నుంచి షాకులు తగులుతూనే ఉన్నాయి. దీని అంతటికీ కారణం, మొండి పట్టుదల, చంద్రబాబు ముద్రలు చెరిపేయాలనే తాపత్రయం. ప్రతి విషయంలోనే ఇదే ధోరణితో ముందుకు వెళ్తూ, జగన్ ప్రభుత్వం ప్రతి నిర్ణయంలోనూ ఇబ్బందుల్లో పడుతుంది. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో అన్నట్టు రాష్ట్ర శాశ్వతం. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతే కాని, గత ప్రభుత్వం చేసినవి అన్నీ నేను రద్దు చేస్తాను అంటే, ప్రభుత్వ వ్యవహారాల్లో అది నడవదు. ఏ కేంద్ర ప్రభుత్వం కాని, ఏ కోర్ట్ లు కాని, ఈ ధోరణిని ఒప్పుకోవు. ఇప్పుడు జగన్ ఇలా చేస్తే, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు కూడా జగన్ చేసినవి అన్నీ ఆపేసి కొత్తవి మొదలు పెడితే ?
అందుకే ఈ ధోరణిని ఏ మాత్రం ఉపేక్షించం అంటూ, అలాంటి సంకేతాలే అటు కేంద్రం, ఇటు కోర్ట్ లు ఇస్తున్నాయి. తాజాగా, పోలవరం పై నవయుగని తప్పించి, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై, నవయుగ హైకోర్ట్ కు వెళ్ళింది. ముఖ్యంగా హైడల్ ప్రాజెక్ట్ విషయంలో, మేము 2021 నవంబర్ నాటికి కట్టి ఇస్తాం అని చెప్తున్నా, ప్రభుత్వం రివెర్స్ టెండరింగ్ కి వెళ్లి, 58 నెలల సమయం అంటుందని, ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని, మా టెండర్ ని రద్దు చేసే తప్పు మేము ఏమి చెయ్యలేదు అంటూ, నవయుగ కోర్ట్ లో వాదనలు వినిపించింది. దీని పై హైకోర్ట్ ఈ రోజు, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నవయుగ కంపెనీకు హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ జగన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సస్పెండ్ చేసింది.
అంతే కాదు, కొత్త టెండర్ కు వెళ్ళ వద్దని స్పష్టం చేసింది. నవయుగ కంపెనీ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్ నోటీసును హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే దీని పై ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుంది. సుప్రీం కోర్ట్ కు వెళ్తుందా, లేక నవయుగ నే కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి. మరో పక్క, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, మా మాట వినకుండా, రివర్స్ టెండరింగ్ కు ఎందుకు వెళ్లారు అంటూ, రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని మొత్తం రిపోర్ట్ ఇవ్వమని, అడిగిన సంగతి తెలిసిందే. దీని పై కూడా, కేంద్రం ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాసం ఉంది. మరి జగన్ ప్రభుత్వం, ఏమి చేస్తుందో వేచి చూడాలి.