‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదలపై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) జారీ చేసిన ఉత్తర్వులు ఇంకా అమలులోనే ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన విలేకరులతో ద్వివేది చిట్‌చాట్‌గా మాట్లాడారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం విడుదల విషయంలో సీఈసీ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని హోంశాఖ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చామన్నారు. ఆ సినిమాను థియేటర్లలో ప్రదర్శించేందుకు అనుమతులు మంజూరు చేయవద్దని స్పష్టం చేశామన్నారు. రాజకీయంగా ప్రభావం చూపే బయోపిక్‌లపై దేశ వ్యాప్తంగా నిషేధం విధిస్తూ ఏప్రిల్ 10వ తేదీన సీఈసీ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. మే 1న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు అనుమతి ఇవ్వాలని ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏప్రిల్ 25వ తేదీన తనకు లేఖ రాశారన్నారు.
అయితే, దేశవ్యాప్తంగా బయోపిక్‌లపై నిషేధం విధిస్తూ సీఈసీ జారీ చేసిన ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని రాంగోపాల్ వర్మకు లేఖ ద్వారా సమాధానం ఇచ్చామని ద్వివేది తెలిపారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తోపాటు మరో రెండు సినిమాలపై కూడా ఈసీ నిషేధ ఉత్తర్వులు జారీ చేసిందనారు. ఈ సినిమాపై సీఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏప్రిల్ 10న జారీ చేసిన ఉత్తర్వులే అమలులో ఉంటాయన్నారు. ఆ సినిమా విడుదలపై సీఈసీ నుంచి తనకు తదుపరి ఉత్తర్వులు ఏమీ అందలేదన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఎలాంటి తాజా ఉత్తర్వులు తమకు అందలేదని సీఈవో గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేసారు.
గతంలో కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు పంపించామని తెలిపారు. కాగా కేంద్ర ఎన్నికల సంఘం సినిమా విడుదలను ఆపుతూ జారీ చేసిన ఉత్తర్వులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న మే 27 వ తేది వరకు ఉంటాయన్నారు ద్వివేదీ. దీంతో రేపు ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ లేనట్టే. ఇదే సమయంలో సినిమా నిర్మాత..దర్శకులు మాత్రం సీఈవో లేఖ పైన ఎటువంటి ప్రకటన చేయలేదు. కొద్ది రోజులుగా వివాదాస్పదంగా మారిన ఈ వ్యవహారం పైన ఆర్జీవి విజయవాడలో మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయటం..పోలీసులు అడ్డుకోవటం..జగన్ విమర్శలు చేయటం తో దీనికి పొలిటికల్ కలర్ అంటుకుంది. తాజాగా, టిడిపి మహిళా నేతలు దివ్యవాణి, యామినీ శర్మ ఇద్దరూ ఆర్జీవీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసారు.