కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య, కరెంట్ యుద్ధం జరుగుతూనే ఉంది. కేంద్రం చెప్పినా వినకుండా, చంద్రబాబుని ఇరికిద్దాం అనుకుని, విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తాను అంటూ జగన్ చేస్తున్న పని, కేంద్రానికి తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. ఈ నేపధ్యంలోనే, కేంద్ర ఇంధన మంత్రి ఆర్కే సింగ్ మరోసారి, జగన్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు, ఎన్నికల్లో గెలుపు కంటే ఈ దేశం, మీ రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటూ వెళ్తే దేశంలో, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని, ఈ మాత్రం ఈ ప్రభుత్వానికి తేలియాదా అని ప్రశ్నించారు. విద్యుత్ కంపెనీలతో ఇప్పటికే ఒప్పందాలను చేసుకున్నారని, వాటిని ఇప్పుడు సమీక్షిస్తాం అంటే, ఎవరైనా ఇక్కడ పెట్టుబడులు పెడతారా అని హెచ్చరించారు. విద్యుత్ ఇస్తున్న కంపెనీలకు రాష్ట్రాలు సకాలంలో చెల్లింపులు చేయని కారణంగా విద్యుత్ రంగానికి బ్యాంకులు రుణాలు ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.
ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూనే, పరిశ్రమల పై అధిక విద్యుత్ చార్జీలు విధించడం పై అసహనం వ్యక్తం చేసారు. సకాలంలో చెల్లింపులు చేపట్టాలని, పునరుత్పాద విద్యుదుత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ రాష్ట్ర ప్రభుత్వ పీపీఏల సమీక్ష నిర్ణయాన్ని తొలి నుండి తప్పుబడుతున్నారు. ప్రధానికి, అమిత్ షా ద్రుష్టికి కూడా ఈ విషయం తీసుకువెళ్ళారు. మరో పక్క కోర్ట్ లు కూడా ఈ విషయంలో, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఒక పక్క రాష్ట్రం, కేంద్రం మధ్య ఈ విషయంలో యుద్ధం నడుస్తున్న తరుణంలో, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కేంద్ర ఇంధన మంత్రి ఆర్కే సింగ్‌కు లేఖ రాసారు.
పునరుత్పాదక విద్యుత్ రంగంలో కేంద్రం బాధ్యతను తాము తలకెత్తుకుని మోస్తున్నామని, ఇది తమకు భారంగా ఉందని, కొంత భారాన్ని కేంద్రమే భరించాలని ఆ లేఖలో కోరారు. దేశం మొత్తమ్మీద ఏటా 60 వేల మిలియన్ యూనిట్ల పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగిస్తుంటే, అందులో ఒక్క ఆంధ్రలోనే 15 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను మేం వినియోగిస్తున్నామని మంత్రి బాలినేని వివరించారు. ఈ లేఖ ద్వారా పునరుత్పాదక విద్యుత్ విషయంలో, ఆంధ్రప్రదేశ్ సుముఖంగా లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ప్రపంచం మొత్తం, పునరుత్పాదక విద్యుత్ వైపు వెళ్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, మేము ఇంకా బొగ్గు మాత్రమే వాడతాం అనే ధోరణిలో ఉండటం, నిజంగా ఆశ్చర్యం.