ఆధిపత్య పోరో.. లేక అనుమానపు పోరో కానీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల వ్యవధిలో చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్లీనంగా అగాథాలు పెరుగుతున్నాయి. శుక్రవారం చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడినట్లుగా ఉన్న ఒక వాయిస్ మెసేజ్ నగరిలోని వైసీపీ ముఖ్యనాయకులకు రావడం కలకలం సృష్టిస్తోంది. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డికి అన్ని నియోజకవర్గాల్లోనూ అనుచరులు, అభిమానులు, బంధువులు ఉన్న విషయం తెలిసిందే. గడచిన ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో గెలవడం వెనుక పెద్దిరెడ్డి కృషి ఉందన్నది వైసీపీ అభిప్రాయం. అదే సమయంలో నగరి ఎమ్మెల్యే రోజాకు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులతో విభేదాలు ఉన్నట్లు కనిపిస్తోంది. నగరిలో వైసీపీ సీనియర్ నేత కేజే కుమార్, ఎమ్మెల్యే రోజా అనుసరిస్తున్న వైఖరిపట్ల తొలినుంచి విభేదిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కేజే కుమార్ జన్మదిన, షష్టిపూర్తి వేడుకలను నగరిలో చేయడానికి ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డితో పాటు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తదితరులకు ఆహ్వానాలు అందాయి. అయితే నగరి ఎమ్మెల్యే రోజాకు కేజే కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిసినప్పటికీ ఆమెకు ప్రత్యేక ఆహ్వానం అందలేదని సమాచారం. దీంతో ఎమ్మెల్యే రోజా అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే రోజా శుక్రవారం హైదరాబాద్ కు బయలుదేరివె ళ్లారు. ఆమె వెళ్లిన కొంత సమయానికి కొంతమందికి రోజా మాట్లాడినట్లుగా వాయిస్ మెసేజ్ లు చేరాయి. అందులో ఉన్న సారాంశం ఏమంటే.. 'అందరికీ నమస్కారం.. నాకు అత్యవసర పని ఉంది. హైదరాబాద్ వెళుతున్నాను. రేపటి వరకు రాలేను. అందరికీ నేను చెప్పాలనుకున్నది ఒకటే. మీరు గెలిపించిన ఎమ్మె ల్యేగా మీకోసం నగరి నియోజకవర్గం అభివృద్ధికి ఎంత దూరమైనా పనిచేస్తాను కానీ, పార్టీకి ద్రోహం చేసి నాకు వెన్నుపోటు పొడిచి, నన్ను పది మందిలో అవమానపరచిన వ్యక్తుల కార్యక్రమాలకు వెళ్లాలనుకుంటే ఈ రోజు నుంచి పార్టీతో సంబంధం లేనట్లు అందరూ గుర్తుంచుకోవాలి.

ఎందుకంటే మంచితనంగా ఉంటే, దానిని చేతగానితనంగా చూడరాదని అందరికీ విన్నవించుకుంటున్నాను. ఎన్నో వత్తిడులు ఉన్నా నగరి అభివృద్ధికి తాను శ్రమిస్తుంటే, ఆ నియోజకర్గ అభివృద్ధిని దెబ్బతీసే విధంగా, ఎమ్మెల్యేను అవమాన పరిచే విధంగా, పార్టీకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమాల్లో పాల్గొనేవారిని పార్టీకి దూరంగా పెడతామని చెబుతున్నా' అంటూ మెసేజ్ లు వచ్చాయి. అయితే ఆమె ఎక్కడా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుగానీ, ఇతరుల పేర్లు గానీ ప్రస్తావించలేదు. ఎమ్మెల్యే రోజాకు, కేజే కుమార్‌కు ఉన్న అభిప్రాయభేదాలతోనే మంత్రి పెద్దిరెడ్డితో విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదిలావుండగా ఇటీవల ఒక చానల్ లో పెద్ది రెడ్డికి, చెవిరెడ్డి భాస్కరరెడ్డికి మధ్య కూడా విభేదాలు ఉన్నట్లు వార్తాకథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read