నగరి ఎమ్మెల్యే రోజా అనుచరవర్గంలో నైరాశ్యం అలుముకుంది. రోజాకున్న పాపులారిటీ, గత ఎనిమిదేళ్ళుగా పార్టీలో పోషించిన పాత్ర ఆమెకు జనంలో చరిష్మా, క్రేజ్‌ను సంపాదించి పెట్టాయి. గత ఎన్నికల్లోనూ, తాజా ఎన్నికల్లోనూ ఆమె వరుసగా రెండుసార్లూ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. జననేతగా పేరున్న గాలి ముద్దకృష్ణమ నాయుడిని, ఆయన తనయుడిని ఓడించారు. ముఖ్యంగా గత ఐదేళ్ళ పాటు ఆమె అధికార టీడీపీని ఇరుకున పెట్టేలా వ్యవహరించారు. శాసనసభలోనూ, వెలుపలా కూడా ఆ పార్టీపై, ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై దాడి చేసే తరహాలో విమర్శలకు దిగారు. అసెంబ్లీ నుంచీ సస్పెన్షన్ వేటునూ ఎదుర్కొన్నారు. ఈ నేపధ్యమంతా వున్నందున జగన్ క్యాబినెట్లో రోజాకు తప్పనిసరిగా స్థానముంటుందని ఆమె అనుచరులు, నగరి పార్టీ శ్రేణులు ధీమాతో వున్నాయి.
శుక్రవారం రాత్రి దాకా నగరి నియోజకవర్గంలో అనుచరవర్గం బాగా హడావిడి చేసింది. అమరావతికి బయల్దేరేందుకు కూడా సన్నద్ధంగా వున్నారు. అయితే జగన్ ప్రకటించిన మంత్రుల జాబితాలో ఆమె పేరు లేకపోవడం పార్టీ శ్రేణులను, అనుచర వర్గాన్ని షాక్‌కు గురి చేసింది. దీంతో నగరి, పుత్తూరుల్లో వైసీపీ శిబిరాలన్నీ ఒక్కసారిగా మూగబోయాయి. నారాయణస్వామి డిప్యూటీ సీఎంగా, పెద్దిరెడ్డి కీలక శాఖల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపధ్యంలో జిల్లా అంతటా వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకోగా నగరిలో మాత్రమే శ్రేణులెవరూ రోడ్లపై కనిపించలేదు. పాపం అభిమానులు చేసిన కలల ప్రచారానికి గాల్లో తేలియాడుతున్న నగరి ఎమ్మెల్యే రోజా ఒక్కసారిగా షాక్ అయ్యారు. జగన్ కుల సమీకరణ రాజకీయాల్లో దారుణంగా మోసపోయిన ఈ తెలుగింటి ఆడపడుచు 2014లో జగన్ వస్తే తానే మంత్రిని అని కలలు కన్నారు. పాపం 2019లో వచ్చి ఆమె రెండు సార్లు వరుసగా గెలిచినా మంత్రి పదవి దక్కలేదు.
25 మందితో జగన్ పెద్ద జంబో కేబినెట్ ఏర్పాటుచేసినా రోజాకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆమె వేదన వర్ణనాతీతంగా ఉంది. చాలా రోజుల నుంచి మీడియా కూడా రోజాకు బెర్త్ దాదాపు ఖాయం అని రాయడంతో ఆమె ఆశలు రెట్టింపయ్యాయి. కానీ జగన్ ఆమెను జబర్దస్త్ కే పరిమితం చేసేశారు. ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించిన మంత్రుల జాబితాలో రోజా పేరు లేకపోవడంతో ఆమె అభిమానులు కలత చెందారు. దీని పై రోజా కూడా జగన్ పై తన అసంతృప్తిని బహిరంగంగానే చూపిస్తున్నారు. ప్రతి సందర్భంలో హడావిడి చేసే రోజా, మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి డుమ్మా కొట్టారు. అలాగే జగన్ ఎప్పుడు తిరుమల వచ్చినా, అన్నీ తానై చూసుకుని, జగన్ పక్కనే ఉండే రోజా, నిన్న తిరుమల పర్యటనలో ఎక్కడా కనిపించలేదు. రోజా వస్తుందని జగన్ కూడా ఆశించారు. అయితే, రోజా ఇచ్చిన జర్క్ తో, జగన్ ఆరా తీసారు. సముచిత స్థానం కల్పిస్తానని, తనను నమ్మాలని చెప్పినట్టు సమాచారం.