మనం ఒక వీడియో ఇంటర్నెట్ లో చూస్తున్నాం... ఆక్సిడెంట్ లు అవ్వకుండా, రోలర్ సేఫ్టీ బ్యారియర్లతో ప్రమాదాలు ఎలా నివారించవచ్చో చూసాం... ఇలాంటివి మన రాష్ట్రంలో కూడా ఉంటే బాగుండు అనుకున్నాం... అయితే, ఇప్పుడు ఇవి మన రాష్ట్రంలో కూడా వస్తున్నాయి... తిరుపతి- తిరుమల ఘాట్ రోడ్డులో జరుగుతున్న ప్రమాదాలను రోలర్ సేఫ్టీ బ్యారియర్లతో చెక్ పెట్టే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పశ్చిమ ఆస్ట్రేలియా సాంకేతిక సహకారంతో ఘాట్ రోడ్డులో ప్రమాదాలను నివారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది.
తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునేందుకు రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. ఒక ఘాట్ రోడ్డు 24 కిలోమీ టర్లు, మరో ఘాట్ రోడ్డు 17 కిలోమీటర్ల మేర ఉన్నాయి. ఈ ఘాట్ రోడ్డులో అతివేగం, డ్రైవింగ్ నైపుణ్యం సరిగా లేకపోవడం, కాలం చెల్లిన వాహనాల వినియోగం వంటి కారణాలతో నెలకు 5 నుంచి 10 వరకూ ప్రమాదాలు జరుగు తున్నాయి. గత ఏడాది 106 ప్రమా దాలు జరిగాయి... ఘాట్ రోడ్డులో ప్రమాదాలు ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రమాదాలు జరుగుతుండటంతో ఇతర దేశాల్లోని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు పశ్చిమ ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రోలర్ సేఫ్టీ బ్యారియర్లను ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్ల వద్ద ఏర్పాటు చేస్తారు. వేగంగా వస్తున్న వాహనం ఈ బ్యారియర్లను ఢీకొంటే పెనుప్రమాదం తప్పే వీలుంటుంది.
ఈ వ్యవస్థలో భాగంగా ఏర్పాటు చేసే రోలర్లు వాహనం ఢీకొనటం ద్వారా వచ్చే షాక్ను తట్టుకుని, దాన్ని రొటేషనల్ ఎనర్జీగా మారుస్తాయి. దీనివల్ల ఢీకొన్న వాహనం తిరిగి రోడ్డు పైనే ఆగిపోతుంది. దీనివల్ల భారీ ప్రమాదం తప్పుతుంది. ఈ విధానాన్ని రహదార్లలోని డివైడర్ల వద్ద, ట్రాఫిక్ ఐలాండ్స్ వద్ద కూడా అమలు చేయడం వల్ల ప్రమాదాలను గణనీయంగా నివారించవచ్చని భావిస్తున్నారు. విదేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ విధానాన్ని తొలిసారిగా తిరుమల ఘాట్ రోడ్లో అమలు చేయనున్నారు. ఇందుకు కావాల్సిన సాంకేతిక సహకారం పశ్చిమ ఆస్ట్రేలియా అందచేస్తుంది. నిధులు రాష్ట్రం సమకూరుస్తుంది. మరికొద్ది రోజుల్లో దీనిపై మరింత స్పష్టత రానుంది.