జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ దాఖలు అయిన పిటీషన్ పైన, సిబిఐ కోర్టు విచారణ ఈ రోజు జరిగింది. ఈ రోజు సిబిఐ అధికారులు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే గత రెండు వారులుగా సిబిఐ కౌంటర్ దాఖలు చేయకుండా కొన్ని కారణాలతో వాయిదా వేయించింది. పోయిన వాయిదాలో, లాయర్లు ఇద్దరికీ జ్వరం వచ్చిందని చెప్పటంతో, సిబిఐ కోర్టు ఈ రోజుకి కేసుని వాయిదా వేసింది. అయితే ఈ రోజు సిబిఐ ఎలాంటి కౌంటర్ వేస్తుంది, జగన్ బెయిల్ రద్దు చేయమని అంటుందా ? వద్దని అంటుందా ? అనే చర్చ జరిగింది. అయితే ఈ రోజు విచారణలో కూడా సిబిఐ ఏమి చెప్పలేదు. ముందుగా తమకు పై నుంచి ఆదేశాలు రాలేదని , కౌంటర్ త్వరలోనే దాఖలు చేస్తామని, మళ్ళీ సాగదీసే ప్రయత్నం చేసింది. అయితే సిబిఐ వైఖరి పై రఘురామకృష్ణం రాజు తరుపు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కావాలని కాలయాపన చేస్తున్నారు అంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇన్ని వాయిదాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని వాదించారు. తీర్పుని ప్రకటించాలని కోరారు. సిబిఐ ఎందుకు ఇలా చేస్తుందో , ఎవరైనా ఇట్టే అర్ధం చేసుకుంటారు అంటూ, వాదించారు. వెంటనే దీని పై ఒక నిర్ణయం తెసుకోవాలని, మరో వాయిదాకి ఆస్కారం ఇవ్వనవసరం లేదని సిబిఐ కోర్టుకి తెలిపారు.
దీంతో కోర్టు 30 నిమిషాలకు వాయిదా వేసింది. వాయిదా అనంతరం సిబిఐ తరుపు న్యాయవాదులు స్పందిస్తూ, తాము ఇది వరకు ఇచ్చిన మెమోని పరిగణలోకి తీసుకోవాలని, బెయిల్ రద్దు చేయాలా వద్దా అనేది కోర్టు విచక్షణాధికారానికి వదిలేసాం అని, కోర్టు ఏమి చెప్తే అది అంగీకరిస్తామని తెలిపారు. అయితే ఇప్పటికే జగన్ తరుపు న్యాయవాదులు, రఘురామ తరుపు న్యాయవాదులు లిఖితపూర్వక వాదనలు సమర్పించటం, సిబిఐ కూడా మీ ఇష్టం అని చెప్పటంతో, సిబిఐ కోర్టు తదుపరి విచారణను ఆగష్టు 25వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఎవరి వాదనలు అవసరం లేకపోవటంతో, అదే రోజు సిబిఐ కోర్టు తమ తీర్పుని ప్రకటించే అవకాసం స్పష్టంగా కనిపిస్తుంది. గత వాదనల్లో కూడా, సిబిఐ న్యాయవాదులు తీరు విమర్శలకు దారి తీసింది. కావాలని వాయిదాలను అడగటం, సాగతీయటం, చివరకు కోర్టు ఇష్టం అని చెప్పటం, ఇది రెండో సారి ఇలా జరగటంతో, కేసుని సాగదీయటానికే సిబిఐ ఇలా వ్యవహరిస్తుంది అనే విమర్శలు వస్తున్నాయి. మరి 25వ తేదీ తీర్పు వస్తుందో లేదో చూడాల్సి ఉంది.