రఘురామకృష్ణం రాజు కేసు, ఆయన విడుదల వ్యవహారంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ నెలకొంది. ప్రధానంగా, రఘురామరాజు గుంటూరు సిఐడి కోర్టు ఆదేశాల ప్రకారం రిమాండ్ లో ఉండి, ఆయనను అక్కడ నుంచి సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రకారం సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ హాస్పిటల్ నివేదిక వచ్చిన తరువాత, సుప్రీం కోర్టులో రఘురామరాజు తరుపు న్యాయవాదులు బెయిల్ పిటీషన్ వేయగా, సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ మంజూరు చేస్తూ, ఆర్మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత పది రోజుల్లో బెయిల్ బాండ్ పేపర్లు సమర్పించాలని ఆదేశించింది. అయితే ఈ లోపు ఆయన, గుంటూరు సిఐడి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ లో సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో చేరినప్పుడు, ఆయన వ్యక్తిగత పూచీకత్తు కోసం ఇచ్చిన బాండ్ ని అమలు చేయాల్సిన బాధ్యత జైలు అధికారులది అని చెప్పి, సిఐడి కోర్టు పేర్కొంది. ఆ విధంగా చేయకపోవటం వలన, సాంకేతికంగా సమస్యలు ఎదురవుతాయని సిఐడి కోర్టు భావించినట్టు తెలుస్తుంది.
రఘురామరాజు రిమాండ్ ను ఈ నెల 25వ తేదీ వరకు పొడిగిస్తూ సిఐడి కోర్టు నిర్ణయం తీసుకున్నట్టు, రఘురామరాజు న్యాయవాదులకు సమాచారం అందింది. దీంతో న్యాయవాదులు, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను సిఐడి కోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళారు. ఆర్మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన పది రోజుల్లో, బండ్లు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు సిఐడి కోర్టు దృష్టికి తెచ్చారు. రిమాండ్ పొడిగిస్తూ ఇచ్చిన సర్టిఫైడ్ కాపి కోసం, రఘరామ రాజు న్యాయవాదులు ఈ రోజు సిఐడి కోర్టులో దరఖాస్తు చేసారు. ఆ సర్టిఫైడ్ కాపీ వచ్చిన తరువాత, దీని పై ఏమి చేయాలనే విషయం పై రఘురామరాజు న్యాయవాదులు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇదంతా సాంకేతికంగా జరిగిన విషయం అని, దీన్ని సాకుగా చూపి, మళ్ళీ రఘురామరాజుని అరెస్ట్ చేసే అవకాసం లేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే సుప్రీం కోర్టు స్పష్టంగా బెయిల్ ఆర్డర్స్ ఇచ్చిందని, అది కాకుండా ప్రభుత్వం కానీ, సిఐడి కానీ ఇప్పుడు ఏమి చేయలేదని చెప్తున్నారు.