నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, జగన్ మోహన్ రెడ్డికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. రెండేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై అనేక ఆరోపణలు చేస్తూ, తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. రఘురామకృష్ణం రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవటంతో, ఆయనకు ముందుగా షోకాజ్ నోటీసులు పంపించారు. షోకాజ్ నోటీసులు పంపించింది విజయసాయి రెడ్డి. దీని పై రఘురామరాజు అభ్యంతరం చెప్పారు. తనకు బీఫాం ఇచ్చింది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా షోకాజ్ నోటీసు పంపిస్తారని ప్రశ్నించారు. అంతే కాదు, నిబంధనలు ప్రకారం, పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇవ్వాలని, అయితే విజయసాయి రెడ్డి ఏ అర్హతతో ఇచ్చారని, విజయసాయి రెడ్డి ఇచ్చిన నోటీస్ చెల్లేదని అన్నారు. దీంతో ఈ మొదటి ఐడియా ఫ్లాప్ అయ్యింది. అయినా రఘురామరాజు ఆగలేదు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనుల పై మీడియాలో చెప్తూనే ఉన్నారు. తరువాత ఇక లాభం లేదు అనుకున్నారో ఏమో, నేరుగా రంగంలోకి దిగారు. విజయవాడ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ, విజయసాయి రెడ్డి సారధ్యంలో ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో స్పీకర్ ని కలిసి, రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని కోరారు.
అయితే దీని పై రఘురామరాజు వివరణ ఇస్తూ, తాను ఎక్కడా పార్టీ పైన కానీ, పార్టీ అధినేత పైన కానీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని అన్నారు. ప్రభుత్వంలో ఉన్న తప్పులను మాత్రమే ఎత్తి చూపానని అన్నారు. ఇది రాజ్యాంగం ప్రకారం తనకు ఇచ్చిన హక్కు ని అన్నారు. దీంతో ఈ ఐడియాకు బెడిసికొట్టినట్టే ఉంది. ఏడాది తరువాత కూడా, మేము ఇచ్చిన అనర్హత పిటీషన్ ఏమైంది అంటూ విజయసాయి రెడ్డి లేఖ కూడా రాసారు. ఇక మొన్న లక్ష ఉత్తరాలు రాయాలని, నిర్ణయం తీసుకున్నారని, సాక్షి ఆఫీస్ లో ఉత్తరాలు ప్రింట్ చేస్తున్నారని రఘురామరాజు లీక్ చేయటంతో, ఇదీ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు మరో సారి, చివరి ప్రయత్నంగా మరో ఎత్తు వేసినట్టు ఉన్నారు. నర్సాపురం నియోజకవర్గానికి చెందిన ఎస్సీలు, ఎస్టీల పేరిట, చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఎస్సీలకు, ఎస్టీలకు రఘురామరాజు మోసం చేసారు కాబట్టి, అనర్హత వేటు వేయాలని కోరటానికి, చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాం అంటూ, ఒక ప్రకటన విడుదల అయ్యింది. అయితే దీని వెనుక వైసీపీ ఉందని, రఘురామరాజు అనుచరులు చెప్తున్నారు. మరి ఈ ప్రయత్నం అయినా ఫలిస్తుందో లేదో చూడాలి.