ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. ఐఏఎస్, ఐపీఎస్ ల వార్షిక నివేదిక ఆమోదించే బాధ్యత జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటారు అంటూ, జీవో జారీ చేసారు. మొన్నటి వరకు కేవలం డీజీపీ, ప్రినిసిపల్ సెక్రటరీ స్థాయి అధికారుల వార్షిక నివేదికలు మాత్రమే సియం ఆమోదంలో ఉండేవి. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో, అందరి అధికారుల వార్షిక నివేదికలు ఆయనే ఆమోదిస్తారు. ఈ నిర్ణయంతో, అధికారుల పై ఒత్తిడి పెరిగి, ప్రభుత్వానికి అనుకూలంగా, అధికార పార్టీ నేతలు ఏమి చెప్తే అదే చేయాలి అనే ఒత్తిడిలోకి వెళ్లిపోతారని, ఈ నిర్ణయం వెనక్కు తీసుకోవాలి అంటూ, అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్షిక నివేదిక ఆధారంగా, వారికి ప్రమోషన్ లు కానీ, కేంద్ర క్యాడర్ కు వెళ్ళటం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీంతో ఎవరికైనా ఈ నివేదిక అనేది చాలా ముఖ్యం. సహజంగా ఇవి చీఫ్ సెక్రటరీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏకంగా జగన్ మోహన్ రెడ్డి ఈ రిపోర్ట్ ఆమోదిస్తారు అంటూ, ఒక జీవో విడుదల అయ్యింది. ఈ జీవో పై , అధికారులు లోలోపల మదనపడుతున్నా, ఎవరూ బహిరంగంగా తమ ఆవేదన చెప్పలేదు. అయితే ఈ విషయం పై వైసీపీ ఎంపీ స్పందించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామరాజు స్పందిస్తూ, ఈ విషయం పై ప్రధాని మోడికి లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ లో పని చేస్తున్న ఐఏఎస్ అధికారుల వార్షిక నివేదిక ఆమోదించే బాధ్యత జగన్ మోహన్ రెడ్డి చేతుల్లో పెట్టటం పై ఫిర్యాదు చేసారు. ఐఏఎస్ లకు వార్షిక నివేదికలు అనేవి, వారి కెరీర్ లో భవిష్యత్తుని నిర్ణయించేవి అని, ఇలాంటి కీలకమైన బాధ్యతను, ఒక రాజకీయ నేత చేతిలో ఎలా పెడతారు అంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని కూడా జత పరిచారు. ఆ జీవో పై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసారు. ఈ నిర్ణయంతో నిజాయతీ పరులైన అధికారులకు అన్యాయం చేసినట్టు అవుతుందని, వారు స్వేచ్చగా సమాజం కోసం పని చేసే వీలు ఉండదని తన ఫిర్యాదులో తెలిపారు. తమ భవితవ్యం పలానా వ్యక్తి చేతిలో ఉందని తెలిస్తే, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా వారు సమర్ధించాలా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవో పై జోక్యం చేసుకోవాలని, తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసారు.