యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రఘురామకృష్ణం రాజు, ఎప్పుడూ చెప్పే విధంగా, వాళ్ళ పార్టీ పై ప్రేమతో, తమ నాయకుడి పై గౌరవంతో, పార్టీకి చెడ్డ పేరు రాకూడదు అనే తాపత్రయంతో, తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లేఖ రాసారు. నిజానికి ఇది జగన్ మర్చిపోయిన విషయం. అలాగే ప్రతిపక్షం కూడా పట్టించుకోని విషయం. అయితే వాళ్ళు మర్చిపోయినా, నేను మర్చిపోను అంటూ, రఘురామకృష్ణం రాజు, లేఖ రాసి మరీ గుర్తు చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా, అవ్వా , తాతలకు మూడు వేలు పెన్షన్ ఇస్తాను అంటూ, వారిని నమ్మించి ఓట్లు వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తీరా ఎన్నికల్లో గెలిచిన తరువాత, అవ్వా తాతలకు ఏడాదికి రూ.250 పెంచుకుంటూ వెళ్తానని చెప్పి, మొదటి ఏడాది కేవలం రూ.2,250 ఇచ్చి ఉసూరుమానిపించారు. అయితే మొన్నే ఏడాది పాలన కూడా పూర్తయింది. ఇప్పుడు 14వ నెలలోకి అడుగు పెట్టారు. అయితే రెండో ఏడాది పెంచాల్సిన రూ.250 మాత్రం ఇంకా పెంచలేదు. మాట తప్పను, మడం తిప్పను అని జగన్ చెప్పే డైలాగ్ కి జరిగే విషయానికి తేడా ఉండటంతో, ఆయన మర్చిపోయిన విషయం గుర్తు చెయ్యటానికి, అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణం రాజు, లేఖ రాసారు.
అవ్వా - తాతలకి మీరు పెంచుతాను అని చెప్పిన రూ.250 పెన్షన్ గురించి మీ దృష్టికి తెస్తున్నాను అంటూ, రఘురామరాజు లేఖ రాసారు. మీరు ఎన్నికల్లో అవ్వా తాతలకు పెన్షన్ రూ.3 వేలు చేస్తాను అని చెప్పారు, దీంతో అందరూ మీకు ఓట్లు వేసారు, తరువాత ప్రమాణ స్వీకారం రోజున రూ.250 పెంచి, ప్రతి ఏడాది రూ.250 పెంచుతాను అని చెప్పారు. వచ్చే జూలై 8న మన ప్రియతమ నాయకుడి జయంతి రోజునైనా, మీరు ఈ ఏడాదికి రూ.250 పెంపు ప్రకటన చేస్తారని ఆశిస్తున్నా అంటూ, రఘురామరాజు లేఖలో పేర్కొన్నారు. ఇక మరో విషయంగా, పెన్షన్ వయసు 65 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు తగ్గించారు, మే 30, 2019నే ఆదేశాలు ఇస్తూ జీవో ఇచ్చారు, కానీ వారికి పెన్షన్లు మాత్రం ఫిబ్రవరి 2020 నుంచి ఇస్తున్నారు. దీని వల్ల వారికి, 7 నెలలకు రూ.15,750 నష్టం వాటిల్లింది. వారు నష్టపోయిన డబ్బులు కూడా లబ్ధిదారులకు ఇవ్వాలని, అలాగే రూ.250 పెన్షన్ పెంచాలని, అలా చేస్తే మీ ఇమేజ్ ఇంకా పెరుగుతుంది అంటూ, రఘురామకృష్ణం రాజు, జగన్ మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేస్తూ, లేఖ రాసారు.