నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు, ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ లో వైద్యం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన కాళ్ళకు అయిన గా-యా-లు, అయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక పోవటంతో, అయన ఇంకా ఆర్మీ హాస్పిటల్ లోనే ఉన్నారు. ఆర్మీ హాస్పిటల్ డిశ్చార్జ్ రిపోర్ట్ ఇస్తే కాని, బెయిల్ ఇవ్వటం కుదరదు అంటూ సిఐడి కోర్టు చెప్పటంతో, ఆయన ఇంకా విడుదల కాలేదు. అయితే ఈ పరిస్థితిలో ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఆర్మీ ఆస్పత్రి కమాండర్‌కు ఈ రోజు ఒక లేఖ రాసారు. తనకు వైద్యం జరుగుతున్న తీరు, ఆరోగ్య పరిస్థితిని ఆ లేఖలో వివరించారు. తనకు కాలి నొప్పి ఇంకా తగ్గలేదని ఆ లేఖలో తెలిపారు. ఇప్పటికే అనేక పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటెక్స్ వాడుతున్నా కూడా, ఇంకా కాలు నొప్పి అలాగే ఉందని అన్నారు. అలాగే తన బీపీలో కూడా హెచ్చుతగ్గులు గమనించామని అన్నారు. నోరు కూడా తరుచూ పొడారిపోతుందని, తన ఆరోగ్య పరిస్థితి పై ఆ లేఖలో వివరించారు. తనకు అంతా సెట్ అయ్యి, ఆరోగ్యం మెరుగు పడే దాకా, ఇక్కడే ఆర్మీ హాస్పిటల్ లోనే వైద్యం అందించాలని, ఆయన కోరారు. ఒక వేళ మీరు నన్ను డిశ్చార్జ్ చేయాలి అనుకుంటే కనుక, తన డిశ్చార్జ్ సమ్మరీలో మొత్తం వివరాలు అన్నీ, తన ఆరోగ్య పరిస్థితి పై, స్పష్టంగా తెలపాలని కోరారు.
ఇలా తన ఆరోగ్య పరిస్థితి గురించి మొత్తం వివరాలతో లేఖలో ప్రస్తావించారు రఘురామరాజు. అయితే ఇదే సందర్భంలో రఘురామరాజు మరో ఆసక్తికర విషయం కూడా తన లేఖలో ప్రస్తావిస్తూ, ఆర్మీ హాస్పిటల్ కమాండర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. సుప్రీం కోర్టు ఇప్పటికే తనను పూర్తిగా ఆర్మీ హాస్పిటల్ లో ఆధీనంలో ఉండమని చెప్పి, సిఐడి అధికారులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిందని, అయితే సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయని అన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొంత మంది పోలీసులు, ఆర్మీ హాస్పిటల్ వద్దే ఉన్నట్టు, తనకు సమాచారం ఉంది అంటూ, రఘురామ కృష్ణం రాజు, సంచలన ఆరోపణలు చేసారు. రఘురామరాజు రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆయన ఆరోగ్యం పై, ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ? ఎందుకు డిశ్చార్జ్ సమ్మరీలో మొత్తం వివరాలు రాయమని అడిగారు ? అలాగే ఏపి పోలీసులకు ఇక్కడ ఉన్నది నిజమేనా ?