ప్రధాని నరేంద్ర మోడీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు లేఖ రాసారు. తమ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఎలా పీక్కుతింటుందో చెప్తూ, ఆ లేఖలో వివరించారు. ప్రధాని మోడి కలుగ చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామకరంగం కుదేలు అయిపోతుందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు వైఖరే కారణం అని ప్రధనికి రాసిన లేఖలో తెలిపారు. కొద్ది రోజులుగా, అనేక మందికి ఉపాధిని ఇచ్చే, జువారి సిమెంట్స్, అమర రాజా కంపెనీలను మూసేయాలి అంటూ, ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో, పారిశ్రామిక రంగంలో ఒక కుదుపు వచ్చిందని అన్నారు. ఇలాంటి మానవత్వం లేని చర్యల వల్ల వేల మంది కార్మికులు, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, రఘురామరాజు తన లేఖలో తెలిపారు. ఈ పరిశ్రమలే కాక, ఈ పరిశ్రమల పై ఆధారపడిన అనుబంధ సంస్థలు కూడా, ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయని, ఆయన ప్రధాని దృష్టికి తీసుకుని వచ్చారు. పారిశ్రామకరంగానికి ఊతానని ఇస్తూ, అనేక చర్యలు తీసుకుని, అనేక మంది ఇన్వెస్టర్స్ ని ఆకర్షించాల్సిన ప్రభుత్వమే, ఇలాంటి రివర్స్ చర్యలకు పాల్పడటం ఆందోళన కలిగించే అంశం అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే పేరు గాంచిన పెద్ద సంస్థలను, ఇలా మూసివేయాలని చెప్పటం, ఏమిటో అర్ధం కావటం లేదని అన్నారు.
అధికార యంత్రాంగం కూడా, జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టు చేస్తూ, సంకుచిత మనస్తత్వంతో పారిశ్రామిక వేత్తలను వేటాడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో విపరీత ధోరణి పెరిగిపోయిందని, వీటిని వెంటనే నియంత్రించాలి అంటూ, ఆయన ఘాటుగా ప్రధాని తెలిపారు. జువారి సిమెంట్స్ కంపెనీలో దాదాపుగా 8 వేల మందికి పైగా ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. వారికి కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా, ఉత్పత్తి నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఇక రెండో సంస్థ అయిన అమరరాజా కంపెనీని కూడా ప్రభుత్వం ఇలాగే టార్గెట్ చేసిందని తెలిపారు. ఆ సంస్థలో కనీసం 15 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని, వీళ్ళ రాజకీయ పగలు, కక్షలతో, ఇప్పుడు ఆ కుటుంబాలు అన్నీ రోడ్డున పడతాయని అన్నారు. చాలా సాధారణ కారణం చూపించి, ఆ సంస్థను మూసివేయాలని చెప్పారని, కార్మికుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో, రాష్ట్రంలో పారిశ్రామికరంగం సంక్షోభంలో ఉందని, ఇలాంటి చర్యలను అడ్డుకోండి అంటూ లేఖలో తెలిపారు.