ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకున్న ఆనందం, ఆర్టీసీలో ఎక్కువ రోజులు నిలువలేదు. ఆర్టీసీ రూట్లలో ప్రైవేటు బస్సులకు అనుమతి వ్యవహారం ముదిరిపాకాన పడుతోంది. ప్రైవేటు బస్సులకు అనుమతిచ్చే విషయంలో ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేదంటూ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మాదిరెడ్డి, ప్రతాప్ స్పష్టం చేసిన 24 గంటల్లోనే పోరుబాటకు సిద్ధమంటూ గుర్తింపు కార్మిక సంఘం నేతలు అల్టిమేటం జారీ చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ మాదిరెడ్డి ప్రతాప్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తుం డగా.. ప్రజలకు సేవలు అందించే విషయం లో ఉద్యోగులతో చర్చలు జరపాల్సిన అవసరం లేదంటూ మేనేజింగ్ డైరెక్టర్ ఖరా ఖండీగా చెపుతున్నారు. ఆర్టీసీలో నెలకన్న వివా దాలపై ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీలు, ఎనిమిది కార్పోరేషన్లలో ప్రైవేటు పాఠశాల, కాలేజీ, ఫ్యాక్టరీలకు చెందిన బస్సులను తిప్పేందుకు అనుమతులు ఇవ్వాలని మేనేజింగ్ డైరెక్టర్ ప్రతాప్ నిర్ణయించారు.

తొలి విడతలో విశాఖపట్టణంలో ప్రైవేటు బస్సు సర్వీసులకు అనుమతులు ఇచ్చిన తర్వాత లోటుపాట్లను సవరించుకొని మిగిలిన చోట్ల అనుమతి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆర్టీసీ ఎండీ ఆయా బస్సుల ఆపరేటర్లతో సమావేశాలు నిర్వహించి చర్చలు జరుపుతున్నారు. ఆర్టీసీ ఎండీ చర్యలను కొద్ది రోజులుగా కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆర్టీసీ రూట్లలో ప్రైవేటు బస్సులను అనుమతించడం అంటే సంస్థను నిర్వీర్యం చేయడమే అనేది కార్మిక సంఘాల వాదన. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరితో చర్చించాల్సి ఉండగా..ఏండీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనేది సంఘాల ప్రధాన వాదన. ఇదే అంశంపై గురువారం ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. జగన్మోహన రెడ్డి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగ భద్రత కలిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం తనను ఆర్టీసీ ఎండీగా నియమించింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకేననే విషయం గుర్తుంచు కోవాలన్నారు. అలాంటప్పుడు వీరు చెప్పినట్లు నడుచుకోవాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఎవరి కాల్లో పట్టుకొని ఉద్యోగం చేయాల్సిన అవసరం తనకు లేదంటూ ఖరాఖండిగా ఎండీ ప్రతాప్ స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమై నందున గతంలో మాదిరి వ్యవహరించడం కుదరదని, నిబంధలకు అనుగుణంగా నడుచుకోవాలని ఏండీ హెచ్చరికలు జారీ చేశారు. ఎండీ వ్యాఖ్యలపై ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, పలిశెట్టి దామోదరరావు శుక్రవారం తీవ్రంగా స్పందించారు. ఏండీ వ్యాఖ్యలు బెదిరించే ధోరణిలో ఉన్నాయని పేర్కొంటూ రవాణాశాఖ మంత్రి పలుమార్లు ఆర్టీసీని ప్రైవేటు పరం చేయబోమని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఈ రోజు, మరో బాంబు పేల్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు, ప్రభుత్వోద్యోగుల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని కార్మిక సంఘాలు మీడియా ముందు మాట్లాడకూడదని నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా సమ్మెలు, ప్రదర్శనలు చెయ్యకూడదని అన్నారు. అయితే, దీని పై కార్మిక సంఘాలు అవక్కయ్యాయి. ఆర్టీసీని విలీనం చేయలేదని, ఉద్యోగులనే విలీనం చేశారని, అయినా మాకు దీంట్లో ఒరిగింది ఏమి లేదని వాపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read