త్వరలోనే ఆర్టీసీలో మహిళా డ్రైవర్లను నియమిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీస్‌శాఖ, ఆర్టీసీలో మహిళలకు రిజర్వేషన్ కల్పించామన్నారు. శుక్రవారం గుంటూరులో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థ భారతదేశానికి గొప్పవరమని అన్నారు. కోటి మంది సభ్యులుండే ఏకైక వ్యవస్థ డ్వాక్రా సంఘాలని, డ్వాక్రా సంఘాల ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి తెస్తామన్నారు. సామాన్య మహిళ.. అసాధారణ శక్తిగా మారిందని చంద్రబాబు కొనియాడారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని, ఇవాళ 98 లక్షల మందికి రూ.3,500 ఇచ్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రాభివృద్ధికి డ్వాక్రా సంఘాలు ఎంతో సహకరించాయని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని, మహిళలకు తల్లిదండ్రుల ఆస్తిలో సమానహక్కు ఉండాలని ఆనాడు చట్టం తీసుకొచ్చారన్నారు. తొలిసారి మహిళలకు విశ్వవిద్యాలయాన్ని.. తిరుపతిలో ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయాల్లోకి మహిళలు రావాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై నిర్లక్ష్య ధోరణి పోవాలని, మహిళలు వంటింటికే పరిమితం కాకూడదన్నారు. మహిళలు ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు అన్నారు. అన్నాచెల్లెళ్ల బంధం-టీడీపీతో అనుబంధం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. అప్పుడు 'అన్న ఎన్టీఆర్’పై కుట్రలు తిప్పికొట్టింది ఆడబిడ్డలేనని, ఇప్పుడు ‘చంద్రన్నపై కుట్రలను’ చిత్తు చేయాల్సింది మహిళలేనని పిలుపునిచ్చారు.
మహిళలే తెలుగుదేశానికి జవజీవాలు అని ఆయన వ్యాఖ్యానించారు. చదువులో, ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు టీడీపీ ఘనతేనని చెప్పారు. ఆడబిడ్డకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆరేనని గుర్తుచేశారు. ఆడబిడ్డలకు ‘పసుపు-కుంకుమ’ పెట్టింది టీడీపేనని చంద్రబాబు చెప్పారు. ‘‘ప్రతి కుటుంబానికి నాలుగైదు రకాల ప్రభుత్వ లబ్ది. ప్రభుత్వ లబ్ది పొందిన అందరి ఓట్లు తెలుగుదేశానికే. రైతులు, మహిళలు, యువతరం మద్దతు టీడీపీకే. మహిళల్లో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంచాం. ప్రతి మహిళ ఖాతాలో ఈరోజే రూ.3,500 ఎంతో ఆనందంగా ఉంది. బోగస్ చెక్కులని అన్న వైసీపీకి మహిళలే బుద్ధిచెప్పాలి. ఇది మా చంద్రన్న ఇచ్చిన ‘పసుపు-కుంకుమ’ అని చాటాలి. ఈ 3 రోజులు అన్నిచోట్ల ర్యాలీలు, సభలు నిర్వహించాలి. దొంగలను నమ్మం అని మహిళలంతా సంకల్పం చేయాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.