సాక్షాత్తు దేశ రాష్ట్రపతే, అమరావతి వచ్చి ఆశ్చర్యపోయి, దేశంలో అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలి, మీరు వచ్చి ప్రధానికి ఈ విషయం చెప్పండి అంటూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చెప్పారు... అదే రియాల్ టైం గవర్నెన్స్ సెంటర్... అయితే, ఈ రోజు కేరళ, పుదుచ్చేరి, కర్నాటక, పశ్చిమ బంగ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల నుంచి మంత్రులు, అధికారులు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. 15వ ఆర్థిక సంఘం పై చర్చించటానికి వచ్చారు. అయితే అంతకంటే ముందు, మీ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ చూడాలని ఉంది అని వారు కోరటంతో, చంద్రబాబు వెంటనే ఆ ఏర్పాట్లు చేసారు.. అహ్మద్ బాబుని పిలిచి, అక్కడ ఏర్పాట్లు చెయ్యమని చెప్పారు.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి సహా, మిగతా రాష్ట్రాల మంత్రులు, అధికారులు మన రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ కు వెళ్లి, దాని పని తీరు చూసి ఆశ్చర్యపోయారు.. ఇది కదా మన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి... ప్రతి ఆంధ్రుడు గర్వ పడాల్సిన విషయం
తరువాత, 15వ ఆర్థిక సంఘం పై చర్చించారు. ప్రగతిశీల రాష్ట్రాలు నీరుగారిపోయేలా కేంద్ర ప్రభుత్వ తీరు వుందని, సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా నడుచుకుంటోందని వివిధ రాష్ట్రాలకు చెందిన ఆర్ధిక మంత్రుల సదస్సు అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్షకు 15వ ఆర్ధిక సంఘం విధివిధానాలు అద్దంపడుతున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 15వ ఆర్థిక సంఘం రూపొందించిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్)ను వ్యతిరేకించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధుల కేటాయింపు చేస్తామంటే జనాభా నియంత్రణ పాటిస్తూ, ఆర్ధికంగా పురోగతిలో వున్న రాష్ట్రాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం తీరు ప్రగతిశీల రాష్ట్రాలకు శిక్ష విధించేట్టుగా వుందన్నారు. అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలు ఎట్టిపరిస్థితుల్లో నష్టపోవడానికి వీల్లేదని చెప్పారు.
ఈ అన్యాయాన్ని సహించేది లేదన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలను మార్చాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతిని కలుద్దామని ముఖ్యమంత్రి సూచించారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రించుకోవడం ద్వారా భవిష్యత్లో లోక్సభ స్థానాలు తగ్గి, రాజకీయంగా ప్రాబల్యం కోల్పేయే పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు. భారత ప్రభుత్వం సహకార సమాఖ్య వ్యవస్థను గౌరవించాలని సూచించారు. ఎఫ్ఆర్బీఎంను కుదించాలన్న కేంద్రం ఆలోచన సరికాదని అన్నారు. 15వ ఆర్ధిక సంఘం టీవోఆర్ ప్రకారం రాష్ట్రాలు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని కోల్పోతున్నాయని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. కేవలం యుద్ధ సమయంలో మాత్రమే ఇలాంటి విధానాన్ని అమలు చేస్తారని, అయితే కేంద్రం ఇందుకు విరుద్ధంగా సాధారణ పరిస్థితుల్లోనూ సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా వుండాలో సర్కారియా కమిషన్ స్పష్టంగా పేర్కొందని గుర్తుచేశారు.