ఉగ్రరూపం దాల్చిన ‘ఫణి’ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. ప్రస్తుతం తుఫాను ఒడిశా రాష్ట్రంలోని ప్రవేశించింది. ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల సమయంలో ఒడిశాలోని గోపాలపూర్-చాంద్‌బలీ మధ్య తీరం దాటుతుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు 170 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల మేర ఉండొచ్చని చెప్పారు. అలలు 1.5 మీటర్ల ఎత్తుకు మించి ఎగసిపడతాయని తెలిపారు. అంతేకాదు, అదే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు, తుఫాను ఇంకా ప్రచండంగానే కొనసాగుతుందని రియల్ టైమ్ గవర్నెన్స్ స్టాండీ (ఆర్టీజీఎస్) తెలిపింది.
తుఫాన్ కదలికలను ఆర్టీజీఎస్ అధికారులు నిరంతరం గమనిస్తున్నారు. ‘ఫణి’ మన తీరాన్ని దాటినప్పటికీ తీర ప్రాంతాలకు వెళ్లకూడని ప్రజలను, తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో యాక్టివ్‌గా ఉండాలని ఉండాలని పోలీసులు, జిల్లాల యంత్రాంగాన్ని ఆర్టీజీఎస్ అప్రమత్తం చేసింది. సర్వైలెన్స్ కెమెరాలతో తీర ప్రాంతాల్లో ఆర్టీజీఎస్ పర్యవేక్షణ జరుపుతోంది. శ్రీకాకుళం జిల్లాకు పొని తుపాను ముప్పు తప్పినట్లేనని జిల్లా కలెక్టర్ జె. నివాస్ స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి ఫొని తుపాను కదలికలను రాత్రంతా గమనించిన ఆయన మాట్లాడుతూ... ఆర్టీజీఎస్ ముందుగా సూచించిన విధంగానే తుపాను గమ్యం సాగించిందన్నారు. జిల్లాలో వర్షపాతం కూడా అనుకున్న విధంగానే నమోదైందన్నారు.
అయితే అసలు సమస్య ఇప్పుడు రానుందని, అందరూ చాలెంజ్ గా తీసుకుని పని చెయ్యాల్సిన సమయం వచ్చిందని అన్నారు. తుఫాను పెద్ద నష్టం జరగకపోయినా, ఒరిస్సాలో కురుస్తున్న భారీ వర్షాలకు, అసలు ఇబ్బంది మొదలైందని అన్నారు. తుపాను అనంతరం వరదలు వచ్చే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా బహుదా, వంశధార నదుల్లో వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వరదలు కూడా సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి, యంత్రాంగం మొత్తం సిద్దంగా ఉందని, ఆర్టీజీఎస్ నుంచి వస్తున్న సమాచారంతో, ఎప్పటికప్పుడు, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అని తెలిపారు.