ఆంధ్రప్రదేశ్ పాలనా రంగంలో త్వరలో ఒక కొత్త వ్యవస్థ ఏర్పాటు కానుంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నూతన వ్యవస్థని ముఖ్యమంత్రి చంద్రబాబు రూపొందించారు... మరో 20 రోజుల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత సన్నిహితం చేసే లక్ష్యంతో ఈ వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. ‘సాధికార మిత్ర’ల పేరుతో నాలుగు లక్షల మంది మహిళలతో స్వచ్ఛంద సేవా దళం రూపొందిస్తున్నారు. పూర్తిగా మహిళలతోనే ఈ వ్యవస్థ ఏర్పాటు కానుంది.
ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మంది సాధికార మిత్రలను ప్రభుత్వం నియమించింది. ప్రతి 35 కుటుంబాలను ఒక యూనిట్ గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.04 కోట్ల గ్రామీణ కుటుంబాల సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఈ సాధికార మిత్రలను వినియోగించనున్నారు. సాధికార మిత్రల నియామకాలను సైతం గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖ( సెర్ప్) ఇప్పటికే పూర్తి చేసేసింది. డ్వాక్రా సభ్యులై ఉండి సేవాభావం కలిగిన 35 ఏళ్ళ లోపు వయసు వారిని ఇందు కోసం ఎంపిక చేశారు. వీరికి కనీస అర్హత 8వ తరగతిగా నిర్ణయించారు.
అలాగే వీరు ఒక స్మార్ట్ ఫోన్ సైతం కలిగి ఉండాలి. వీరందరికీ సరైన శిక్షణ ఇచ్చి ఒక గుర్తింపు కార్డును ఇవ్వనున్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా వీరికోసం ఒక ప్రత్యేక యాప్ ను కూడా రూపొందిస్తున్నారు. వీరి ఫోన్లలో ప్రభుత్వమే ఒక ఉచిత సిమ్ వేయిస్తుంది. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ప్రస్తుతం ఉన్న 1100 కాల్ సెంటర్ లోనే అదనంగా మరో 250 మందితో మరో విభాగాన్నికూడా ఏర్పాటు చేయనున్నారు. మరో 20 రోజుల్లో ఇవన్నీ పూర్తయి రాష్ట్రంలో ఒక నూతన వ్యవస్థ ఏర్పడనుంది. ప్రజాసమస్యలు తక్షణం పరిష్కారం కానున్నాయి.