33 వేల ఎకారాలు ఇచ్చినప్పుడు కూడా, ఎలాంటి ఆందోళన చెయ్యని అమరావతి రైతులు, ఈ రోజు రోడ్డున పడ్డారు. రోడ్డు మీద వంట వార్పూ చేసి, ఉదయం ఆందోళన చేసిన అమరావతి రైతులు, సాయంత్రం జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక చూసి, భగ్గుమన్నారు. తమకు అన్యాయం చేసారని, 33 వేల ఎకరాలు, ఇక్కడ రాజధాని వస్తుందని ఇచ్చామని, ఇప్పుడు ఇక్కడ ఏమి లేకుండా, మా పై కక్ష కట్టినట్టు చేస్తున్నారని అన్నారు. జీఎన్ రావు కమిటీ పై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు. మందడంలోని వై జంక్షన్ వద్ద రాజధాని రైతుల ధర్నాలు, నిరసనలు చేపట్టారు. అలాగే సచివాలయం వద్ద జగన్ మోహన్ రెడ్డి జన్మదిన బ్యానర్లు చించివేసారు. సచివాలయం ముఖద్వారం సమీపం వరకు చొచ్చుకొచ్చి రైతులు బైటాయించారు. జీఎన్ రావు కమిటీ సభ్యులను అడ్డుకునేందుకు అమరావతి రైతుల ప్రయత్నించారు. జీఎన్ రావు కమిటీ సభ్యులను, పోలీసులు వేరే మార్గంలో పంపించారు. జీఎన్ రావు కమిటీ సభ్యులను అడ్డుకునే ప్రయత్నం చెయ్యటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
సచివాలయం ఎదురుగా, రోడ్డుకు అడ్డంగా పడుకుని రైతులు ఇంకా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రోడ్డు పై టైర్లు కాల్చి, మంటలు పెట్టరు. ఆ ప్రాంతం అంతా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు నినాదాలు చేస్తున్నారు. అసలు జీఎన్ రావు కమిటీ మా ప్రాంతంలో పర్యటించలేదని, కనీసం మా అభిప్రాయాలను కమిటీ తెలుసుకోలేదని ఆరోపించారు. అసలు జీఎన్‌రావు కమిటీకి చట్టబద్ధత లేదని, దీని పై కోర్ట్ లో కేసు ఉండగానే, ఇప్పుడు ఆయన ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. అమరావతిలో వరద ముప్పు అంటూ సాక్షి చెప్పినట్టు చెప్తున్నారని, మరి విశాఖలో తుఫానులు మనం చూడలేదా ? సునామీ వచ్చింది తెలియదా అని ప్రశ్నించారు.
అలాగే కర్నూల్ లో వరదలు వచ్చి, ఎంత మంది చనిపోయారో, 2009లో చూడలేదా అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని ఉన్న ప్రాంతంలో, ఇప్పటి వరకు వరదలు రాలేదని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని రైతులు అంటున్నారు. రైతులకు తీవ్ర ఆన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జీఎన్ రావు కమిటీ కాదని, ఇది జగన్ కమిటీ అంటూ నినాదాలు చేస్తున్నా. ఈ ఆందోళనలో ఆడవాళ్ళు, చిన్న పిల్లలు కూడా పాల్గునటం గమనార్హం. పరిస్థితి గంట గంటకూ అదుపు తప్పుతుంది. అందరూ వచ్చి సచివాలయం ముందు బైటాయించారు. ఏ క్షణంలో అయినా సచివాలయంలోకి చొచ్చుకు వెళ్ళే అవకాసం ఉండటంతో, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితి సమీక్షిస్తున్నారు.