కర్ణాటక శాసనసభకు వచ్చే నెల 12వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పోటాపోటీగా కృషి చేస్తున్నాయి. అదేసమయంలో బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. అయితే, భారతీయ జనతా పార్టీ తరపున టాలీవుడ్ హీరో సాయికుమార్ బరిలోకి దిగుతున్నారు. సాయికుమార్ మంగళవారం ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోగల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అలాగే గోరంట్లలోగల వినాయక దేవస్థానంలో పూజలు నిర్వహించారు. రాబోయే ఐదేళ్లలోనూ ప్రధానిగా మోదీనే ఉంటారని, కర్ణాటకలోనూ భాజపా ప్రభుత్వం వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్ వేయడానికి ముందు కదిరి, గోరంట్ల పట్టణానికి విచ్చేసి లక్ష్మీనరసింహస్వామివారిని, వినాయక దేవస్థానాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాగేపల్లి వెళ్లి తన అనుచరులు, బీజేపీ కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబునాయుడు దృఢ సంకల్పంతో పని చేస్తున్నారని ప్రశంసించారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువేళ్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని, ప్రధాని మోదీ తప్పక సహకరిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోదీని కోరతానని, అవసరమైతే ఆయన కాళ్లు పట్టుకుంటానని సాయికుమార్ భావోద్వేగం చెందారు.
ప్రధాని మోదీపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని సాయికుమార్ అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. కర్ణాటకలోని బాగేపల్లి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సాయికుమార్ పోటీ చేయనున్నారు. తన తల్లి స్వగ్రామమైన బాగేపల్లి బెంగళూరు నగరానికి అతి సమీపంలోనే ఉన్నప్పటికీ.. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉందని ఆయన చెప్పారు. అమ్మ కోరిక మేరకు బాగేపల్లి అభివృద్ధికి తనవంతు కృషి చేయాలనే సంకల్పంతోనే అక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తమ ఇలవేల్పు అయిన నారసింహుడి ఆశీస్సులతో నామినేషన్ వేయాలనే ఉద్దేశంతోనే స్వామివారి దర్శనానికి వచ్చినట్లు ఆయన తెలిపారు.