మొన్నటి వరకు రాజధాని రచ్చబండ పేరుతో, జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రఘరామరాజు, స్టైల్ మార్చి, ఇప్పుడు రోజుకి ఒక లేఖ వదులుతూ, జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు విస్మరించటం, ఇచ్చిన మాట తప్పి, వెనకడుగు వేయటం, ఇలా అనేక అంశాల పై లేఖలు రాస్తున్నారు. ఇప్పటికే పదికి పైగా లేఖలు రాసిన రఘురామరాజు, తాజాగా మరో లేఖ ఈ రోజు రాసారు. శాసనమండలి రద్దుకు సంబంధించిన అంశాన్ని, ఈ రోజు తన లేఖలో ప్రస్తావించారు. శాసనమండలిలో బలం లేనప్పుడు శాసనమండలిని రద్దు చేయాలని జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎవరూ నమ్మలేదని, ఏడాదికి 60 కోట్లు వృధా ఖర్చు అంటూ ఆయన చెప్పనా ఎవరూ నమ్మలేదని, బలం లేదు కాబట్టి, శాసనమండలి రద్దు చేయాలని అంటున్నారని, అందరూ ఆరోపణలు గుప్పించిన సంగతి గుర్తు చేసారు. ఇప్పుడు శాసనమండలిలో బలం వచ్చింది కాబట్టి, ఈ సమయంలో శాసనమండలి రద్దు చేయాలని ఒత్తిడి తీసుకుని వస్తే, అప్పుడు జగన్ మాటలు అందరూ విశ్వసిస్తారని, ఆయనకు గౌరవం పెరుగుతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఆయన సహజంగా ప్రదర్శించే వ్యంగ్యాన్ని అంతా రంగరించి, ఈ లేఖలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు.
అధికారంలోకి వచ్చిన రెండేళ్ళకు శాసనమండలిలో మెజారిటీ సాధించినందుకు ధన్యవాదాలు చెప్తూనే, శాసనమండలి రద్దు అంశం పై మీ నిర్ణయం ఏమిటి అంటూ ప్రశ్నించారు. మీరు మాట తప్పరు, మడమ తిప్పరు కాబట్టి, వెంటనే శాసనమండలిని రద్దు చేసేందుకు కేంద్రం పై ఒత్తిడి తేవాలని ఆ లేఖలో రాసారు. అయితే ఎప్పుడూ రఘురామరాజు లేఖలకు స్పందించిన ప్రభుత్వం, అనూహ్యంగా ఆయన లేఖకు స్పందిస్తూ, సజ్జల రామకృష్ణా రెడ్డి సమాధానం చెప్పారు. మండలి రద్దు తీర్మానం తాము వెనక్కు తీసుకోవటం లేదని, అది ఎత్తుగడతో చేసింది కాదని సజ్జల చెప్పారు. అయితే దీనికి మళ్ళీ రఘురామరాజు రియాక్ట్ అవుతూ, హర్షం వ్యక్తం చేసారు. సజ్జలకు అభినందనలు తెలిపారు. తన లేఖ పై , సజ్జల స్పందిస్తూ , మండలి రద్దు పై వెనక్కు వెళ్ళేది లేదని తెగేసి చెప్పారని, ఏకంగా నలుగురు కొత్త శాసనమండలి సభ్యులు ప్రమాణస్వీకరం రోజు ఈ విషయం చెప్పారని, ఇక నుంచి ప్రతి రోజు శాసనమండలి రద్దు కోసం, నా వంతు ప్రయత్నం చేస్తాను అంటూ, మండలి రద్దు దిశగా కర్తవ్యోన్ముఖుడినై పనిచేస్తానని హామీ ఇచ్చారు.