సంగం డయిరీలో అవకతవకలు జరిగాయి అని, ప్రభుత్వ ఆస్తులు ఉన్నప్పటికీ వాటిని సంగం డయిరీ ఉపయోగించుకుని వ్యాపారం చేసుకుంటుంది అంటూ, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సంగం డయిరీని తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగిస్తూ యాజమాన్యాన్ని ఇందుకు సహకరించాలని, సబ్ కలెక్టర్ ని బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించింది. దీని పై సంగం డయిరీ గతంలో హైకోర్టు సింగల్ బెంచ్ లో, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోని సవాల్ చేసింది. దీని పై రాష్ట్ర ప్రభుత్వం తమ వైపు వాదనలు వినిపించినా, ప్రభుత్వం ఇచ్చిన వివరణ సంతృప్తిగా లేక పోవటంతో, ప్రభుత్వం ఇచ్చిన జీవో హైకోర్టు సింగల్ బెంచ్ కొట్టేసింది. ఈ జీవోని కొట్టివేయటం పై, రాష్ట్ర ప్రభుత్వం డివిజనల్ బెంచ్ లో అపీల్ చేసింది. దీని పై పిటీషన్ దాఖలు చేసింది. ఈ డివిజనల్ బెంచ్ లో చీఫ్ జస్టిస్ అనూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ జయసూర్య ఉన్నారు. ఈ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అపీల్ పై విచారణ జరిపింది. ఈ విచారణ దాదపుగా అయుదు నెలలు నుంచి జరిగింది. ఈ విచారణ సందర్భంగా అటు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి, ఇటు సంగం డయిరీ వైపు నుంచి కూడా వాదనలు వినిపించారు. ఈ రోజు కొద్ది సేపటి క్రితం రాష్ట్ర హైకోర్టు ఈ విషయం పై తమ తీర్పుని వెల్లడించింది.
ఈ తీర్పులో ప్రధానంగా ప్రభుత్వం, సంగం డెయిరీని స్వాధీనం చేసుకునేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. సింగెల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏది అయితే ఉందొ, ఆ తీర్పుని హైకోర్టు డివిజనల్ బెంచ్ సమర్ధించింది. హైకోర్టు సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అమలులో ఉంటుంది అంటూ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అపీల్ ను, హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. అదే విధంగా ఈ కేసులో తాము కూడా ఇంప్లీడ్ అవుతాం అంటూ, కొంత మంది వేసిన ఇంప్లీడ్ పిటీషన్లు కూడా హైకోర్టు కొట్టి వేసింది. దీంతో ఈ అంశం పై రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పాలి. హైకోర్టు తీర్పు పై సంగం డెయిరీ వర్గాలు సంతోషం వ్యక్తం చేసింది. నరేంద్ర కూడా ఈ తీర్పు పై హర్షం వ్యక్తం చేసారు. మరి ప్రభుత్వం దీని పై సుప్రీం కోర్టుకు వెళ్తుందా, లేదా ఏమి చేస్తుంది అనేది చూడాలి. ఇప్పటికే డివిజనల్ బెంచ్, సింగల్ బెంచ్ ఈ నిర్ణయాన్ని కొట్టివేయటంతో, ఇప్పటికైనా ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకుంటుందా లేదా అనేది చూడాలి.