నిన్న రాత్రి 12 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీల ఎకౌంటులో ఉన్న నిధులు, ఈ రోజు ఉదయం చూసుకుంటే, ఎకౌంటులో జీరో బ్యాలెన్స్ కనిపించటంతో, పంచాయతీ సర్పంచ్లు, అధికారులు కంగుతిన్నారు. పంచాయతీలలో వాటర్ టాక్స్, హౌస్ టాక్స్, డ్రైనేజ్ సెస్ ఇలా ఇవన్నీ వసూలు చేసి, జనరల్ ఫండ్స్ లో ఉంచుతారు. ఇది కాకుండా ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కావటం, కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఎకౌంటులో జమ అయ్యాయి. ఇవి మొత్తం సుమారుగా, రూ.4 వేల కోట్లు కాగా, శుక్రవారం ఉదయం చూసుకుంటూ అన్ని ఎకౌంటులలో జీరో బ్యాలెన్స్ కనిపించటంతో, ఒక్కసారిగా సర్పంచ్లు అంతా కూడా కంగుతిన్నారు. ఈ నేపధ్యంలోనే, నిన్న సాయంత్రం ఈ విషయం పై పంచాయతీ సర్పంచుల ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ దృష్టికి తీసుకుని వచ్చారు. రాష్ట్రంలో అని పంచాయతీల ఎకౌంటులో జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నాయని చెప్పారు. గతంలో కూడా ఇలాగే 14, 15వ ఆర్ధిక సంఘం నిధులు సుమారు 7,600 కోట్లను కూడా ఈ విధంగా, రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందని, పంచాయతీ సర్పంచ్లు గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు, కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు మండలం, బొడ్డపాడు గ్రామ పంచాయతీ గురించి చెప్పారు.
ఆ పంచాయతీ ఎకౌంటులో ఉన్న సుమారుగా రెండు లక్షల నిధులను, రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా దొంగలించిందని వైవీబీ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. అదే విధంగా గంపలగూడెం మండలం, లింగాల గ్రామంలో కూడా, రూ.50 వేలు జనరల్ ఫండ్స్ నుంచి లాగేసుకుందని, ఇలా పంచాయతీల మొత్తం నుంచి కూడా ఇలా జనరల్ ఫండ్స్ నుంచి లాగేసుకున్నారని సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. ఇక పంచాయతీల్లో కనీసం, స్వీపర్లకు, రోజు వారీ టీ ఖర్చులకు కూడా డబ్బులు లేకుండా, జీరో బ్యాలెన్స్ చేసి, మొత్తం ప్రభుత్వం లాగేసిందని, ఈ విధంగా ప్రభుత్వం డబ్బులు లాగేయటం ఏంటని నిలదీస్తున్నారు. వైసీపీ సర్పంచ్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాగే డబ్బులు లగేయటం పై ఆందోళన చేసారు. ఇప్పుడు వరుసగా రెండో ఏడాది కూడా ఇలాగే పంచాయతీల నుంచి డబ్బులు లాగేసారు. వీరందరూ ఇప్పుడు ప్రభుత్వం పై, ఒత్తిడి తేవటానికి రెడీ అవుతున్నారు. ప్రభుత్వం పై పోరాటం చేస్తామని, వదిలి పెట్టేది లేదని అంటున్నారు.