జగన్ మోహన్ రెడ్డికి చెందిన సొంత కంపెనీ, సరస్వతీ సిమెంట్స్ కు ప్రభుత్వం నుంచి నజరానాలు అందుతూనే ఉన్నాయి. ఎవరైనా ఒత్తిడి చేసారో లేక, రూల్స్ ప్రకారం చేస్తున్నారో లేక జగన్ మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేసే అత్యుత్సాహమో కాని, జగన్ గారి సొంత కంపెనీకి, అనుమతులు తన్నుకుంటూ వస్తున్నాయి. నెల క్రితం, సరస్వతి పవర్స్ కు కృష్ణా నది నీళ్ళు, శాశ్వత నీటి కేటాయింపులు ఇచ్చిన ప్రభుత్వం, నేడు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. సరస్వతి సిమెంట్స్ మైనింగ్ లీజ్ ను, ఏకంగా 50 ఏళ్ళుకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తంగా గుంటూరు జిల్లాలో ఉన్న, 613.70 హెక్టార్లలో ఉన్న మైనింగ్ ను, 50 ఏళ్ళ పాటు సరస్వతీ సిమెంట్స్ కు కేటాయిస్తూ, జీవో నెంబర్ 30 విడుదల చేస్తూ, నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కంపెనీలో జగన్ కు 26.4 కోట్లు విలువ చేసే షేర్లు వాటా ఉండగా, ఆయన భార్యకు 13.8 కోట్ల విలువ చేసే షేర్లు వాటా ఉంది. ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సూచన మేరకు, జీవ విడుదల అయ్యింది. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ను గుంటూరు జిల్లాలో పెట్టాలి అనుకుని, దాచేపల్లి, మాచవరం మండలాల్లో కొన్ని గ్రామాల్లో భూములు సేకరణ చేసారు.
ప్రభుత్వంలో తన తండ్రే ఉండటంతో, అనుమతులు వచ్చేసాయి. అయితే, కొన్ని భూములు ప్రైవేటు వ్యక్తులు నుంచి కూడా తీసుకున్నారు. భూములు తీసుకునే సమయంలో, ఉద్యోగాలు ఇస్తాం అని ఆశ పెట్టారు. రాజశేఖర్ రెడ్డి చనిపోవటం, జగన్ కేసులతో, ఈ కంపెనీ సమయానికి స్థాపించక పోవటంతో, భూములు ఇచ్చిన వారు, తమ భూముల్లో సేద్యం చేసుకోవటానికి సిద్ధం కాగా, కొంత మంది వైసిపి నాయకులు వారి పై దాడి చెయ్యటం, పోలీసులు కేసులు నమోదు కావటం తెలిసిందే. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత, అక్కడ స్థానికులు జరిగిన విషయం చెప్పటంతో, రూల్స్ కు విరుద్ధంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ని చంద్రబాబు క్యాన్సిల్ చేసారు. 2019లో జగన్ అధికారంలోకి రాగానే, దీనికి అనుమతి ఇవ్వటం, శాశ్వతంగా నీటి కేటాయింపులు జరగటం, ఇప్పుడు ఏకంగా 50 ఏళ్ళు లీజుకి ఇవ్వటం జరిగిపోయాయి. ఒక వేళ చంద్రబాబు ఇలాగే చేస్తే, ఈ పాటికి హైదరాబాద్ మీడియా, కొంత మంది మేధావులు, ఎంత గోల చేసేవారో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మాత్రం, ఎవరూ మాట్లాడటం లేదు.