శాతవాహన ఎక్స్‌ప్రెస్ విజయవాడ, సికింద్రాబాద్ ల మధ్య నడిచే సూపర్ఫాస్ట్ ట్రైన్ ఇది... 351 కిమీ దూరం, 5 గంటల 35 నిమిషాలతో చేరుకుంటుంది ఇది. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మరియు మధిరల మీదుగా సికింద్రాబద్ నుండి విజయవాడకు వెళుతుంది. విజయవాడ నుండి సికింద్రాబద్ కు పొద్దున్నే మొదలయ్యే రైళ్ళలో ఇదొకటి. శాతవాహన ఎక్స్‌ప్రెస్ లో మొత్తం 20 బోగీలు ఉంటాయి. అయితే, శాతవాహన ఎక్స్‌ప్రెస్ నవంబర్ ఒకటి నుంచి, గుంటూరు దాకా వెళ్లనుంది..
విజయవాడ - సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న శాతవాహన ఎక్స్‌ప్రెస్ గుంటూరు వరకు పొడిగించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ రైలు (నెంబర్ 12713) గుంటూరులో ఉదయం 5.15 గంటలకు బయలుదేరి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ కు 11.55 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (నెంబర్ 12714) సికింద్రాబాద్ లో సాయంత్రం 4.15 కి బయలుదేరి విజయవాడ మీదుగా గుంటూరుకు రాత్రి 11.15 గంటలకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు.
నవంబరు ఒకటి నుంచి అమలయ్యే కొత్త టైం టేబుల్ లో ఈ రైలు గురించి పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఇప్పటికే గుంటూరు నుంచి పల్నాడు ఎక్స్‌ప్రెస్ ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు బయలుదేరి నడికుడి మీదుగా వికారాబాద్ వెళ్తుంది. అదే విధంగా ఉదయం 6.00కి గోల్కొండ ఎక్స్‌ప్రెస్ విజయవాడ మీదుగా సికింద్రాబాద్ కు వెళ్తుంది.