జగన్ పాలన పై మరో నేత, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. రోజు రోజుకీ వైసీపీలో అసంతృప్తి గళాలు వినిపిస్తున్న సమయంలో, తాజాగా విజయనగరం జిల్లాకు చెందిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణి మామయ్య, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు, వైసీపీ ప్రభుత్వం పై, సంచలన ఆరోపణలు చేసారు. కురుపాం నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదని, శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు అన్నారు. కురుపాం నియోజకర్గం, సాక్షాత్తు డిప్యూటీ సియం ప్రాతినిధ్యం వహిస్తున్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. వైసీపీ పార్టీకి అనుకూలంగా లేకపోతే, అన్ని అర్హతలు ఉన్నా, లబ్దిదారులకు పథకాలు మంజూరు చెయ్యటానికి, అధికారులు పదే పదే తిప్పించుకుంటున్నారని అన్నారు. డిప్యూటీ సియం పుష్ప శ్రీవాణి నియోజకవర్గంని కొంత మంది అధికారులు అసలు పట్టించుకోవడం లేదని సంచలన ఆరోపణలు చేసారు. అభివృద్ధి పనులు పనులు పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయాయని అన్నారు. అవకాశం ఉన్నా జల వనరుల శాఖలో తాగునీటి సమస్య పరిష్కారం చేయలేకపోతున్నామని అన్నారు.
మంచి రోడ్లు కూడా వేయలేని పరిస్థితి నెలకొందని, పింఛన్లు కూడా పూర్తిగా ఇచ్చే పరిస్థితి లేదని, శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వైసీపీ ప్రభుత్వం పైనే గళం విప్పారు. కుల వ్రుత్తిదారులను ఆదుకోవటం కోసం, ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళిక లేదని ఆరోపించారు. ఈ సమస్యలు అన్నీ, ఎవరికీ తెలియ చెయ్యాలో, అర్ధం కావటం లేదని శత్రుచర్ల అన్నారు. అయితే డిప్యూటీ సియం పుష్ప శ్రీవాణి సొంత మామయ్య కావటంతో, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. జగన్ పాలన ఏడాది అయిన తరువాత నుంచి, వరుస పెట్టి, సొంత పార్టీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సొంత పార్టీ పాలన పైనే ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న, సీనియర్ నేత, మాజీ మంత్రిగా పని చేసిన ఆనం కూడా, ఏడాది పాలన కేకు సంబురాలు తప్ప, అభివృద్ధి అనే మాట ఎక్కడా లేదు అంటూ, వ్యాఖ్యలు చెయ్యటమే కాక, మరో ఏడాది చూస్తాను, పరిస్థితి మారకపోతే సొంత పార్టీనే నిలదీస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే రఘురామకృష్ణ రాజు, ప్రసన్నకుమార్ రెడ్డి, ఇలా వరుస పెట్టి, ప్రతి ఒక్కరు సొంత ప్రభుత్వం పైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.