సుప్రీం కోర్టు జస్టిస్ పై, అలాగే హైకోర్టు జస్టిస్ ల పై ఆరోపణలు చేస్తూ, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖ రాసి, తరువాత ఆ లేఖను మీడియాకు విడుదల చేసి, న్యాయమూర్తులను అల్లరి చేసిన విషయం పై, దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి, జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు వచ్చాయి. అయితే దీని పై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుంది అనే విషయం పై అందరికీ సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే నెల రోజులు అయిపోవటంతో, అసలు సుప్రీం కోర్టు ఈ విషయం పై స్పందిస్తుందా లేదా అనేది కూడా సస్పెన్స్ గా మారింది. ఇక మరో పక్క, జగన్ రాసిన లేఖ, దాన్ని మీడియాకు విడుదల చేయటం తప్పుబడుతూ, కొంత మంది సుప్రీం కోర్టులో పిటీషన్ లు కూడా వేసారు. అయితే ఇప్పటి వరకు దీని పై సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఇప్పుడు ఈ మూడు పిటీషన్ల పై విచారణ చేయనున్నట్టు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ నెల 16న జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా దాఖలు అయిన మూడు పిటీషన్ల పై విచారణ జరగబోతుంది. జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ రవీంద్ర భట్ జడ్జిలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ మూడు పిటీషన్లు వస్తున్నాయి. వీరు ఈ మూడు పిటీషన్లను విచారణ చేయనున్నారు. జడ్జిల పై ఆరోపణలు చేస్తూ వారిని అల్లరి చేయటం, అలాగే ఆ లేఖను బహిర్గతం చేయటం పై కూడా ఈ మూడు పిటీషన్లు దాఖలు అయ్యాయి. పిటీషన్ వేసిన వారు న్యాయవాదులు. జీఎస్ మణి, ప్రదీప్ కుమార్, సునీల్ కుమార్ సింగ్ అనే ముగ్గురూ వేరు వేరు పిటీషన్లు వేసారు.
యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ కూడా మరో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్లు ఈ నెల 16న విచారణకు రాబోతున్నాయి. ఈ పిటీషన్ లో ప్రధానంగా, జగన్ మోహన్ రెడ్డిని సియం పదవి నుంచి తొలగించాలని, ఆయన రాజ్యాంగా హద్దులు మీరారని, ఆ స్థానంలో ఉండటానికి అనర్హుడని వారు తెలిపారు. అలాగే మరో పిటీషన్ లో, షోకాజ్ నోటీస్ ఇవ్వాలని, కోర్టు ధిక్కరణ నోటీస్ ఇవ్వాలని కూడా పిటీషన్ లో పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు కోసం, ఆధారాలు లేకుండా విషం చిమ్మారని, భవిష్యత్తులో ఎవరూ ఇలా చేయకుండా, సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని కూడా మరొక పిటీషన్ లో కోరారు. దేశ అత్యున్నత న్యాయస్థానం యొక్క ప్రతిష్టను జగన్ మోహన్ రెడ్డి దిగజార్చే ప్రయత్నం చేసారని, వివక్షపూరితంగా అవినీతి ఆరోపణలు చేయటం రాజ్యాంగానికి కూడా విరుద్ధం అని తెలిపారు. మరో పక్క, ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ, రెండు సార్లు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు లేఖ రాసి, జగన్ పై కోర్టు ధిక్కరణ కేసు పెట్టటానికి అనుమతి ఇవ్వాలని కూడా కోరారు. అయితే మొదటి సారి ఇది చీఫ్ జస్టిస్ పరిధిలో ఉందని సమాధనం చెప్పిన విషయం తెలిసిందే.