ఇటీవల జార్ఖండ్ లో హైకోర్టు జడ్జిని కొంత మంది మార్నింగ్ వాక్ చేస్తుంటే, హ-త్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు సుప్రీం కోర్టు కూడా సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుతో సంబంధం లేకుండా, 2019లో దాఖలైన పిటీషన్ పై, కరుణాకర్ మహాళిక్ అనే వ్యక్తి, జడ్జిల భద్రత పై ఒక పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కోర్టులు, జడ్జిల విషయంలో తీసుకుంటున్న చర్యల పై విచారణ జరిగింది. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ విచారిస్తుంది. ఈ కేసు విషయం పై, గత విచారణలోనే అన్ని రాష్ట్రాలను అఫిడవిట్ వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు అన్నీ, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు కాబట్టి, ఆయా రాష్ట్రాలనే, ఈ భద్రత విషయం పై అఫిడవిట్ వేయాలని ఆదేశాలు జారీ చేసారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు మాత్రామే పాటించాయి. కొన్ని రాష్ట్రాలు అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, మిజోరం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లు ఇలా ఈ రాష్ట్రాలు, సుప్రీం కోర్టు ఆదేశించినట్టు అఫిడవిట్ దాఖలు చేయలేదు.
కొంత మంది కొంత సమయం కావలి అంటూ సుప్రీం కోర్టుని కోరగా, చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేసారు. సమయం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే అంతకు ముందే, అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్రాల పై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. కోర్టు చెప్పిన చేయకపోవటంతో, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు లక్ష రూపాయల జరిమినా విధించింది. ఈ జరిమానాని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ సంక్షేమ నిధికి ఉపయోగించాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా పది రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలనీ, అలా దాఖలు చేయని పక్షంలో, చీఫ్ సెక్రటరీని సుప్రీం కోర్ట్ కు పిలిపిస్తాం అంటూ సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే, ఈ విచారణకు ఏపి నుంచి న్యాయవాదులు ఎవరూ హాజరు కాలేదు. సుప్రీం కోర్టు అడుగుతున్న ప్రశ్నలకు ఏపి నుంచి సమాధానం చెప్పే వారు లేకుండా పోయారు. మొత్తానికి మొన్నటి వరకు హైకోర్టు వరుకే పరిమితమైన అంశాలు, ఇప్పుడు సుప్రీం కోర్ట్ వరకు చేరాయి. మరి గడువులోగా ఏపి అఫిడవిట్ దాఖలు చేస్తుందో, సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురి అవుతుందో చూడాలి.