ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరో షాక్ తగిలింది. గత వారం స్థానిక ఎన్నికల విషయంలో, సుప్రీం కోర్టులో భారీ దెబ్బ తగిలిన ఏపి ప్రభుత్వానికి, ఈ సారి మరో కేసు విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటీషన్ వేయగా, సోమవారం విచారణ చేసిన సుప్రీం కోర్టు, పిటీషన్ ను కొట్టేసింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తరువాతే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. జస్టిస్ రోయింగ్ టన్ నారీమన్, జస్టిస్ అనిరుధ్ బోస్‌ల ధర్మాసనం ఈ రోజు ప్రభుత్వం పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం పై వేసిన పిటీషన్ మీద విచారణ జరిపి, ఈ తీర్పు ఇచ్చింది. ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకంకు సంబంధించి, ఏపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఆ ప్రాజెక్ట్ కు లేవని, వెంటనే ప్రాజెక్ట్ నిర్మాణం ఆపేయాలని, పర్యావరణ అనుమతులు వచ్చిన తరువాతే నిర్మాణం చేపట్టాలని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టులో అపీల్ చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు కొట్టేయాలని, ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరింది.
దీని పై ఈ రోజు సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరుపున న్యాయవాది వెంకట రమణి వాదనలు వినిపించారు. పురుషోత్తంపట్నం ఎత్తిపోతల ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్ట్ కాదని కోర్టు ముందు వాదనలు వినిపించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖపట్నం కు నీరు అందిస్తామని, దీని కోసం పోలవరం ఆయకట్టు ద్వారా నీరు అందిస్తామని వాదించారు. దీనికి కొత్త ఆయుకట్టు లేదని, కొత్త ఆయుకట్టు లేని ప్రాజెక్ట్ కోసం, మళ్ళీ పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని వాదించారు. ఇక రైతుల తరుపున న్యాయవాది శ్రవణ్ వాదనలు వినిపిస్తూ, ప్రాజెక్ట్ కోసం తీసుకున్న భూమికి ఇంకా పరిహారం ఇవ్వలేదని వాపోయారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కోసం ఎప్పుడో పర్యావరణ అనుమతులు వచ్చాయని, 2006లో వాటికి అనుమతి వచ్చిందని, పురుషోత్తమపట్నం ప్రాజెక్టు ఇప్పుడు చేపట్టారని, అందుకే దీని పై పర్యావరణ, సామాజిక ప్రభావాలు అధ్యయనం చేయాలని కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుని సమర్ధిస్తూ, ప్రభుత్వ పిటీషన్ కొట్టేసింది.