జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టింది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకా? ప్రజలకు మంచి చేయడానికా? అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో ఈ నెల 9న జరిగిన జనసేన ప్రజా పోరాట యాత్రలో అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి మొళ్ల రాజమనోహర్‌నానీ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదవశాత్తు మూత్రపిండం కోల్పోయాడు. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని కారెం శివాజీ ఆదివారం ఉదయం పరామర్శించారు. ప్రమాద వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పోరాడుతున్న పవన్‌కు కిడ్నీ కోల్పోయిన ఎస్సీ విద్యార్థిని పరామర్శించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కేవలం రూ.50 వేలిచ్చి చేతులు దులుపుకున్న జనసేన నాయకుల దుర్మార్గాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు. రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో బస చేసిన పవన్‌కల్యాణ్‌కు విద్యార్థి పరిస్థితి గురించి చిత్రాలతోసహా కుటుంబ సభ్యులు వివరించినా కనీసం పరామర్శించడానికి రాలేదని విమర్శించారు. పవన్ వెంటనే రాజమనోహర్‌నానీని పరామర్శించి రూ.25లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
కవాతుకు వెళుతున్న జనసేన కార్యకర్తలు బైక్‌లపై వేగంగా వెళుతూ రాజ్‌మనోహర్‌ను ఢీ కొట్టి ఈడ్చుకుపోయారని.. బాధితుడు తల్లి దం డ్రులు రాజమహేంద్రవరంలో ఉన్న పవన్‌కల్యాణ్‌కు తమ కుమారుడి నిస్సహాయస్థితిని వివరించడానికి వెళ్లినా, పవన్‌కల్యాణ్ పట్టించుకోకపోవడం పట్ల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన పార్టీ కార్యకర్తల ఆగడాలకు ఎస్పీ విద్యార్థులను బలి తీసుకోవాలని చూస్తే ప్రతిఘటన ఉంటుందన్నారు. రాజమనోహర్‌ను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. యువకుడి పరిస్థితిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, బాధితులకు అండగా ఉంటామని ఆయన చెప్పారు.