తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో ఇసుక మాఫియాను అడ్డకున్న దళిత యువకుడిపై దాడి చేసి, శిరోముండనం చేసిన ఘటనపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జాతీయ ఎస్టీ, ఎస్సీ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదుపై కమిషన్ స్పందిస్తూ విచారణకు ఆదేశించింది. ఆ మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకు లేఖ రాస్తూ ఘటనపై పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ నివేదికలో సంఘటనకు కారణమైన మొత్తం నిందితుల పేర్లు తెలియజేయాలని స్పష్టంగా కోరింది. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ దళితులకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని అన్నారు. వర్ల రామయ్య రాసిన లేఖకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ స్పందించడంపై ఆయన స్వాగతించారు. ఇకపై దళితులపై ఎటువంటి దాడులు జరిగినా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని, తెలుగుదేశం పార్టీ తరుపున న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
వర్ల రామయ్య మాట్లాడుతూ, "దళిత యువకుని శిరో ముండనానికి కవల కృష్ణమూర్తి కారణం కాదా? శిరోముండనానికి కృష్ణమూర్తే కారణమని వరప్రసాద్ స్టేట్ మెంట్ ఇచ్చినా పట్టించుకోవడంలేదు. ఏ తప్పూ చేయని కొల్లు రవీంద్రను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆధారాలున్నా కవల కృష్ణమూర్తిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు.? మీకో న్యాయం, విపక్షాలకు ఓ న్యాయమా...ఇదేనా మీ దళిత సిద్ధాంతం. కవల కృష్ణమూర్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. హోంమంత్రి ఎందుకు భేషజాలకు పోతున్నారు? వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేకి. ముఖ్యమంత్రి చెప్పేదొకటి చేసేదొకటి. దళితులు ఓట్లు వేయకపోతే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారా? కానీ ఆయనకు కొంచెమైనా విశ్వాసం లేదు. పాదయత్ర సమయాన్ని జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలి. దళితులకు జగన్ శిరోముండనం చేయిస్తున్నారు. దళిత మహిళపై అత్యాచారం జరిగితే ఇదేమని అడిగే దిక్కులేదు రాష్ట్రంలో. మాస్కు పెట్టుకోలేదని ఓ దళిత యువకుడిని అన్యాయంగా చంపేశారు. ఇందుకా మీకు ఓట్లు వేసి గెలిపించింది? " అని వర్ల స్పందించారు.