బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను ఆదివారం మధ్యాహ్నం తీవ్ర తుపానుగా మారింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు 450 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. సోమవారం సాయంత్రం విశాఖ-తుని మధ్య తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 20కి.మీ. వేగంతో ఉత్తర వాయవ్య దిశగా తుపాను కదులుతోంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర తీరం అంతటా ఆకాశం మేఘావృతం అయ్యింది. నెల్లూరు నుంచి కృష్ణా జిల్లాల వరకు మోస్తరు నుంచి చిరుజల్లులు, పశ్చిమగోదావరి నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.

holiday 16122018 1

తుపాను ప్రభావంతో తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుపాను సమీపించే కొద్దీ 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగింది. మూడు నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ తుపాను గమనాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తోంది. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా తుపాను హెచ్చరికల సందేశాలను జారీ చేస్తోంది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టీజీఎస్‌, ఎస్‌డీఎంఏ ద్వారా సమీక్షిస్తున్న చంద్రబాబు ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశారు.

holiday 16122018 1

మరో పక్క కృష్ణా జిల్లా కలెక్టర్, జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలలకు రేపు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల యంత్రాంగం కూడా రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవలు ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, జిల్లాలో 14 మండలాలపై తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందని హోంమంత్రి చినరాజప్ప పేర్కొన్నారు. అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిత్యావసర సరకులు, ఇతర అవసరాలు అన్నీ అందుబాటులో ఉంచామని చెప్పారు. హెలికాఫ్టర్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. తుపాను తీవ్రతను బట్టి 72 నివాసిత ప్రాంతాల నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 17 తుపాను ప్రభావిత మండలాలు ఉన్నాయని, అన్ని ప్రాంతాల్లో సహాయక బృందాలు రంగంలో ఉన్నాయని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read