ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల పై, ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి క్లారిటీ వచ్చింది. ఇక హైకోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుంది, దీని పై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తుందా, లేక ఎలక్షన్ కమిషన్ తో సహకరిస్తుందా లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. హైకోర్టులో గత ఏడాది వేసిన పిటీషన్ విచారణకు వచ్చిన సందర్భంలో, ఇప్పుడు ఎన్నికలు జరుపుతారా లేదా చెప్పాలి అంటూ, ఒక అఫిడవిట్ వేయమని హైకోర్టు, ఎలక్షన్ కమిషన్ ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలు ప్రకారం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీని పై కసరత్తు చేసింది. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం పెట్టింది. రాష్ట్ర హెల్త్ అధికారులతో మాట్లాడింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలుసుకోవటానికి, రాష్ట్ర చీఫ్ సెక్రెటరి నుంచి నివేదిక తెప్పించుకుంది. ఈ మొత్తం కసరత్తు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్, హైకోర్టుకి అఫిడవిట్ రూపంలో సమర్పించింది. తాము ఎన్నికలకు సిద్ధం అని ప్రకటించింది. సమయం చూసుకుని, ఎన్నికల షడ్యుల్ కూడా ప్రకటిస్తామని చెప్పింది. అయితే ఇదే సందర్భంలో పలు విషయాలు కూడా కోర్టుకు తెచ్చింది. ముఖ్యంగా ఎన్నికలు జరపటానికి, బ్యాలెట్ బాక్స్ లు సిద్ధంగా లేవని చెప్పింది. గతంలో తెలంగాణా నుంచి తెప్పించామని, అయితే హైదరాబాద్ లో మునిసిపల్ ఎన్నికలు రావటంతో, వారు తమ బ్యాలెట్ బాక్సులు ఇవ్వాలని కోరటంతో, వారికి తిరిగి ఇచ్చేసామని, అలాగే వివిధ దక్షిణాది రాష్ట్రాలతో మాట్లాడామని అయినా, ఎవరి నుంచి సహకారం అందలేదని తెలిపింది. బ్యాలెట్ బాక్సుల అందుబాటుని బట్టి, తాము ఎన్నికల షడ్యుల్ ప్రకటిస్తామని కోర్టుకు తెలిపింది.
ఇక అలాగే మార్చి నెలలో నామినేషన్ లో సందర్భంలో జరిగిన ఘటనలు గురించి కూడా ప్రస్తావిస్తూ, ఈ సారి అదనపు బలగాలు కావాలని, ప్రభుత్వం దీనికి సహకారం అందించాలని కోరింది. అయితే తమతో ప్రభుత్వం , శత్రుత్వం పెంచుకున్న నేపధ్యంలో ప్రభుత్వం నుంచి సహకారం రావటం లేదని తెలిపింది. గత మార్చిలో క-రో-నా ని ఎలా ఎదుర్కోవాలో ఎవరికీ తెలియదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, మొత్తం అన్ లాక్ చేసారని, ఎలా సమర్ధవంతంగా ఎదుర్కోవాలో అవగహన వచ్చిందని, అదే విధంగా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని, అన్నీ పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకుని ఎన్నికల నిర్వహణ చేస్తామని, అయితే దీనికి ప్రభుత్వ సహకారం అవసరం అని తెలిపింది. గతంలో జరిగిన ఘటనల పై కేంద్రానికి కూడా నివేదిక ఇచ్చామని తెలిపింది. తాము కొంత మంది అధికారులని బాధ్యత చేసి చర్యలు తీసుకున్నా, ప్రభుత్వం పట్టించుకోలేదని కూడా కోర్టుకు తెలిపింది. తాము ఎన్నికల నిర్వహణకు సిద్ధం అని, స్వేచ్చగా, ఎలాంటి ఘటనలు జరగకుండా , ప్రభుత్వం సహకారం ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ కోర్టుకు తెలిపింది. మరి ఎన్నికల కమిషన్ అఫిడవిట్ పై ప్రభుత్వం కౌంటర్ వేస్తుందా, లేక కోర్టు ఏదైనా నిర్ణయం ప్రకటిస్తుందా అనేది చూడాల్సి ఉంది.