రాష్ట్ర ఎన్నికల కమీషనర్, తనకు కేంద్ర భద్రత కావాలి అంటూ నిన్న లేఖ రాసిన నేపధ్యంలో, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కార్యాలయానికి కేంద్ర బలగాలు చేరుకున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి భద్రత పెంచారు. ఎస్ఈసీ కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. బందర్ రోడ్డులోని రాష్ట్ర కార్యాలయానికి సీఆర్పీఎఫ్ పోలీసులు చేరుకున్న. ఎస్ఈసీ కార్యాలయం వద్ద 10 మంది సీఆర్పీఎఫ్ సీబ్బందితో భద్రత కల్పిస్తున్నారు. గన్నవరం లోని 39బెటాలియన్ నుంచి వచ్చిన సీఆర్ పీఎఫ్ బలగాలు. 1ఎస్సై, 1 హెడ్ కానిస్టేబుల్ , 8మంది కానిస్టేబుళ్లతో ఎస్ఈసీ కార్యాలయానికి భద్రత కల్పిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, రమేశ్ కుమార్‌కు 1+1 నుంచి 4+4కి ప్రభుత్వం నిఘా పెంచింది. ఉదయం నుంచి 4+4 సెక్యూరిటీ విధుల్లో చేరింది. మరో పక్క, తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, సీఎస్‌ నీలం సాహ్ని భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికలపై సుప్రీంతీర్పు అనంతరం తదుపరి పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

అలాగే రమేష్ కుమార్ రాసిన లేఖ పై కూడా అనుమానాలు ఉన్నాయి అంటూ, చెప్తూ ఉండటంతో, వాటి పై కూడా చర్చించారు. మరో పక్క ఇదే అంశం పై, స్థానిక సంస్థల ఎన్నికలు మొదటి నుంచి నిర్వహించాలని, రాజకీయ పక్షాల నేతలు గవర్నర్​ బిశ్వభూషణ్​ను కోరారు. ఏకగ్రీవాలు సహా అన్నింటిని రద్దుచేసి రీనోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాజకీయ పక్షాల నేతలు కలిశారు. స్థానిక ఎన్నికలు మళ్లీ మొదటినుంచి నిర్వహించాలని 10 పేజీల వినతిపత్రం అందజేశారు. ఏకగ్రీవాలు సహా అన్నింటిని రద్దు చేసి రీనోటిఫై చేయాలని కోరారు. ఎస్‌ఈసీ పేరిట వచ్చిన లేఖను ఈసీ పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషనర్​ భద్రత విషయం కూడా గవర్నర్​ దృష్టికి తీసుకెళ్లినట్లు విపక్ష నాయకులు తెలిపారు. రాష్ట్రంలో పరిణామాలన్నీ ఆయనకు వివరించినట్లు పేర్కొన్నారు.

అయితే వైసీపీ మాత్రం ఆ లేఖ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. ఎన్నికల కమిషనర్​ రమేష్ కుమార్ పేరిట ఉన్న ఓ జీ మెయిల్ ఖాతా నుంచి హోంశాఖకు రాసిన లేఖ రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన విధంగా ఉందని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యానించారు. కేంద్ర హోంశాఖకు లేఖ ఎవరు రాశారన్న అంశం తక్షణమే తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై డీజీపీకి ఫిర్యాదు చేసి, కుట్ర వెనుక ఎవరున్నారనేది బయటపెడతామని అన్నారు. కొందరు కావాలనే రాష్ట్రప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లేఖలో రాసిన విషయాన్ని ఎన్నికల కమిషనరే బయట పెట్టాలని డిమాండ్​ చేశారు. తెదేపాకు అనుకూలంగా వ్యవహరించిన ఎన్నికల సంఘం దారుణంగా విఫలమైందని వైకాపా ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు. ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తూ హోం శాఖకు లేఖ రాశారో లేదో కూడా చెప్పలేని స్థితిలో ఎన్నికల కమిషనర్ ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read