రాష్ట్రంలో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందిగా మారడంతో సచివాలయంలో వాస్తుదోషం కారణంగానే అన్న సెంటిమెంట్ వెంటాడుతోంది. రాష్ట్రంలో వైకాపా భారీ ఆధిక్యంతో విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టినా...పాలనా పరంగా సంతృప్తి పొందలేకపోతున్నామనే ఆందోళన ఉంది. సంవత్సర కాలంగా ఎదురవుతున్న కోర్టు కేసులు, ఆర్ధిక సమస్యలు, రాజకీయ పక్షాల ఆందోళనలు, ఉద్యమాలు ప్రభుత్వ పెద్దలకు చికాకు తెప్పిస్తున్నాయి. దీనంతటికీ సచివాలయంలో వాస్తు దోషమే కారణమని సిద్ధాంతులు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సిద్ధాంతుల సూచనల మేరకు పవిత్ర శ్రావణ మాసంలో వాస్తు దోష నివారణకు సోమవారం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ప్రధానంగా సచివాలయంలోని సీఎం బ్లాక్ వద్ద గల ఉత్తరం గేటుకు అడ్డంగా గోడ కడుతున్నారు. అలాగే 4, 5 బ్లాకుల మధ్యలో గల దక్షిణం గేటును కూడా మూసివే యనున్నారు. వీటితోపాటు సచివాలయం - శాసనసభను కలిపే ఉత్తర వాయువ్యం గేటు ను తీసేసి గోడ కట్టనున్నారు.

అలాగే సచివాలయం మెయిన్ గేటు వద్ద గల రిసెప్షన్ వద్ద మరో గోడను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు మరికొన్ని నిర్మాణాలు కూడా చేపట్టే అవకాశం ఉంది. వైకాపా అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రిగా జగన్ సచివాలయానికి వచ్చే ముందు ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వాస్తు సిద్ధాంతులను తీసుకొచ్చి సీఎంవోలో మార్పులు చేర్పులు చేశారు. అయితే, ఇటీవలికాలంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పులు, నిమ్మగడ్డ వ్యవహారం, మండలి రద్దు, రాజధాని ఉద్యమం తదితర విషయాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. శాసనాలుచేసే శాసనసభ అమలుపర్చే సచివాలయంలో వాస్తు దోషమే వీటన్నింటికీ కారణమని సిద్ధాంతులు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సమస్యలను గట్టెక్కించేందుకు వాస్తు నిపుణుల సూచనల మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా సచివాలయం, అసెంబ్లీ రక్షణ చర్యల్లో భాగంగానే గేట్లకు అడ్డంగా గోడలు కడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read