రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి కారణమైన మండలి చైర్మన్ నిర్ణయంలో అనూహ్యమైన భారీ ట్విస్ట్ నెలకొంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టం బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలంటూ మండలి చైర్మన్ తన విచక్షణాధికారం మేరకు నిర్ణయం ప్రకటించారు. దీనిపై మండిపడ్డ ప్రభుత్వం ఏకంగా మండలినే రద్దు చేసింది. మండలి రదైనా, సెలెక్ట్ కమిటీ కొనసాగుతుందని ఇందుకోసం కమిటీ ఏర్పాటులో భాగంగా పార్టీల నుంచి పేర్లను కోరుతూ లేఖలు రాసామని చైర్మన్ ప్రకటించారు. ఇంతలో కొత్త ట్విస్ చోటు చేసుకొంది. చైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని మండలి అధికారులు ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. ఇదే సమయంలో అధికారపార్టీ నేతల నుంచి మండలి కార్యదర్శికి లేఖలు అందాయి. టిడిపి మరోవైపు ఒత్తిడి కొనసాగిస్తోంది. చైర్మని నిర్ణయం తుదిదని ఖచ్చితంగా అమలు చేయాలంటూ టిడిపి వాదిస్తోంది. చైర్మన్ తీసుకున్న నిర్ణయం అమల్లో ట్విస్ట్ మీద ట్విస్టు చోటు చేసుకొంటున్నాయి. చైర్మన్ నిర్ణయంతో ఏకంగా మండలినే రద్దు చేసిన ప్ర భుత్వం ఇప్పుడు బిల్లుల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

సెలెక్ట్ కమిటీలో నియమించే ఎమ్మెల్సీల పేర్లు పంపాల్సిందిగా ఆయా పార్టీలకు లేఖలు రాయాలని మండలి ఇన్చార్జి, కార్యదర్శికి ఇప్పటికే లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితుల్లో చైర్మన్ ఆదేశాల ప్రకారం ఆయన వెంటనే లేఖలు రాస్తారు. కానీ ప్రభుత్వ ఒత్తిడి బలంగా ఉండటంతో ఆయన ఇంతవరకూ ఈ లేఖలు వంపలేదు. ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే యోచనతో తెలుగుదేశం శాసనసభాపక్షం తమ తరపున 10 మంది ఎమ్మెల్సీల పేర్ల జాబితాను ఇప్పటికే కార్యదర్శికి అందజేసింది. ఒక్కో కమిటీలో టిడిపి కోటా కింద ఐదుగురు సభ్యులు వస్తారు. ఇది అందజేసినట్లు కార్యదర్శి నుంచి రశీదు కూడా తీసుకున్నారు. టిడిపి నేతల నిర్ణయంతో వైసీపీ తమ వ్యూహాలకు పదును పెట్టింది. మండలిలో సభా నాయకుడిగా ఉన్న ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాస్ చంద్రబోస్, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి గురువారం విడి విడిగా కార్యదర్శికి లేఖలు రాశారు. నియమాలకు విరుద్ధంగా సెలెక్ట్ కమిటీల ఏర్పాటు జరుగుతున్నందున అందులో తాము భాగస్వామి కాబోమని తమపార్టీ నుంచి ఎవరూ ఈ కమిటీల్లో ఉండరని ఉమ్మారెడ్డి తనలేఖలో స్పష్టంగా పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. కమిటీలు ఏర్పాటు చేయాలని చైర్మన్ తీసుకున్న నిర్ణయం నియమాలకు విరుద్ధమని అందువల్ల కమిటీలు ఏర్పాటు చేయవద్దని కోరుతూ బోస్ మరో లేఖ రాశారు.

ప్రభుత్వ అధికారి అయిన కార్యదర్శి అటు ప్రభుత్వ పక్షం మాట కాదనలేక, ఇటు చైర్మన్ ఆదేశాలను ధిక్కరించే పరిస్థితిలేక, ఏ నిర్ణయం తీసుకోకుండా రోజులు నెట్టుకొస్తున్నారని అసెంబ్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారులకు సంకటంగా, ఏకంగా మండలిలో సభానాయకుడే లేఖ రాయడంతో ఇప్పుడు ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై అధికారులు మళ్లగుళ్లాలు పడుతున్నారు. అటు ప్రభుత్వం, ఇటు చైర్మన్ ఆదేశాలు కావడంతో ఏంచేయాలనే దానిపై తేల్చుకోలేకపోతున్నారు. దీంతో కమిటీల ఏర్పాటు ఆలస్య మవుతోంది. అయితే మండలిలో చైర్మన్ నిర్ణయమే ఫైనలనీ, మండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీర్మా నం చేసినా రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసేవరకు మండలి కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతు న్నారు. అప్పటి వరకు చైర్మన్ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. లేకుంటే అదికారులపై సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు పరిగణించవలసి వస్తుందని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. చైర్మన్ ఆదేశాలను మండలి కార్యదర్శి అమలు చేయాల్సిందేనని టీడీపీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మండలిలో సెలెక్ట్ కమిటీల ఏర్పాటు బిల్లులను వారికి అప్ప గించడంపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read