పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది ఏకే గంగూలీ ఆదివారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. గోదావరి మధ్యలో నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్, గోదావరిని మళ్లించడానికి నిర్మిస్తున్న స్పిల్ వే, కాఫర్ డ్యామ్‌లు, గేట్ల తయారీ కేంద్రాన్ని చూశారు. ఆయన వెంట రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు, హైకోర్టు న్యాయవాది కనకమేడల రవీంద్ర కుమార్, జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు. పరిశీలన అనంతరం ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ వి.శ్రీధర్, ఎస్‌ఈ వి.ఎస్.రమేష్‌బాబు తదితరులతో గంగూలీ సుదీర్ఘంగా చర్చించారు. అధికారుల నుంచి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒడిశా అభ్యంతరాలపై కోర్టుకు సమర్పించాల్సిన పత్రాలను అందజేయాల్సిందిగా గంగూలీ ఇంజినీర్లను ఆదేశించారు.
మరో పక్క పోలవరం ప్రాజెక్ట్ కి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. పోలవరం ప్రాజెక్టు తుది అంచనాలతో సహా డిజైన్ల ఆమోదం, రీయింబర్స్‌మెంట్ విషయంలో కేంద్రం కావాలని ఆలస్యం చేస్తుంది. 2019 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుంది. జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుగా కేంద్రం నిధులు విడుదల చేసినా.. ప్రధాని మోదీకి గానీ, బీజేపీకిగానీ ఎలాంటి క్రెడిట్ దక్కదనే నిశ్చితాభిప్రాయానికి కేంద్రంలోని పెద్దలు వచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే... పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన నిధులను రీయింబర్స్‌మెంట్ చేయడంలో సవాలక్ష అడ్డంకులను సృష్టిస్తోందని జల వనరుల శాఖ ఉన్నతాధికారవర్గాలు వివరిస్తున్నాయి.
పోలవరం 2013-14 తుది అంచనాలు రూ. 58,319.06 కోట్లకూ కేంద్ర జల సంఘం ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ ఇప్పటిదాకా ఈ తుది అంచనాలపైనా ఎలాంటి నిర్ణయామూ తీసుకోలేదు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన పనులకు సంబంధించిన డిజైన్లపైనా కేంద్ర జలసంఘం ఆమోదం తెలపకుండా నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తోంది. ఎక్కడా ఎలాంటి తప్పూ కనిపించకపోవడంతో.. గతంలో వేసిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ వేస్తూ కేంద్రం కాలయాపన చేస్తోంది. వీటన్నింటిపైనా కేంద్రంతో మాట్లాడేందుకు జల వనరుల శాఖ సిద్ధమైంది. వారంలో ఢిల్లీకి వెళ్లి చర్చలు జరపాలని నిర్ణయించింది. అవసరం అయితే, పోలవరం పై కూడా మరో పోరాటానికి సిద్ధం అంటూ చంద్రబాబు చెప్పారు. ఇంత జరుగుతున్నా, రాష్ట్రంలో ప్రతిపక్షాలు, మేము సియం అయిపోతున్నాం అని చెప్పే పవన్, జగన్ మాత్రం, పోలవరం పై ఒక్కటంటే ఒక్క మాట కూడా కేంద్రాన్ని అనటం లేదు..