విశాఖపట్నం పర్యటనలో ఉన్న విజయసాయి రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. విశాఖలో కాపులు అందరూ ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఈ సమావేశంలో వైసీపీ నాయకుడు, జగన్ సన్నిహితుడు, విజయసాయిరెడ్డి పాల్గొనడం పై అక్కడకు వచ్చన ప్రజలు ఎదురు తిరిగారు. అక్కడకు రావటమే కాకుండా, ప్రభుత్వం గురించి, జగన్ గురించి చెప్తూ ఉండటంతో, ప్రజలు ఎదురు తిరిగారు. ఇది కేవలం కాపులు అందరూ తమ సాధకబాధకాలు పై ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం అని, విజయసాయి రెడ్డి లాంటి వేరే కులాల వారిని ఇక్కడకు ఆహ్వానించడంతో పాటుగా, స్టేజ్ ఎక్కించి, జ్యోతి ప్రజ్వలన చేయించడం పై అక్కడ ఉన్న వారు ఆగహ్రం వ్యక్తం చేసారు. మీ రాజకీయాలు పార్టీ కార్యాలయంలో చేసుకుని, ఈ పరిస్థితి కారణం మీరే అంటూ, అక్కడే ఉన్న మంత్రి అవంతి శ్రీనివాసరావును చుట్టుముట్టి, అక్కడ ఉన్న వారు నినాదాలు చేశారు. ఈ ఘటన విశాఖపట్నంలో కంబాలకొండ వద్ద ఆదివారం జరిగింది.
ఈ సమావేశం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసారు. చాలా మంది కాపు పెద్దలు ఈ సమావేశానికి వచ్చారు. రిటైర్డ్ డీజీపీ సాంబశివరావు తదితరులు హాజరై ప్రసంగించారు. అయితే అంతా సాఫీగా సాగుతున్న సమయంలో, 12 గంటల సమయంలో మంత్రి అవంతితో పాటుగా ఎంపీ విజయసాయిరెడ్డి, హంగామా చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చారు. అయితే విజయసాయిరెడ్డితో మంత్రి జ్యోతిప్రజ్వలన చేయించడంతో అక్కడున్నవారు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అది కాపుల కోసం సమవేశమా, లేక వైసీపీ సమవేశమా అంటూ ఆందోళనకు దిగారు. మీ రాజకీయల కోసం, కాపులు కాని వారిని కూడా ఇక్కడ పిలిపించటం, రాజకీయ ప్రసంగాలు చేపించటం ఏమిటి, మమ్మల్ని అవమానిస్తారా, విజయసాయి కిందకు దిగాలి అంటూ నినాదాలు సెహ్సారు.
దీంతో విజయసాయి రెడ్డి కలగచేసుకుని, తాను కాపునే అని, నెల్లూరులో రెడ్లను కాపులు అనే పిలుస్తారని, పదో తరగతి సర్టిఫికెట్ లో కూడా, ఓసీ కాపు అని ఉంటుందని, చెప్పుకొచ్చే ప్రయత్నం చేసారు. అయినా అక్కడ ఉన్న వారు అందరూ, నిరసనలు, స్లొగన్స్ ఇస్తూ ఉండటంతో, కొంచెం సేపు అక్కడ ఉండి, చేసేది లేక విజయసాయి రెడ్డి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే అవంతి సీరియస్ అయ్యి, నేను మంత్రి కాబట్టే సహనంగా ఉన్నాను, సహనాన్ని పరీక్షించకండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయినా నిరసనలు ఆగలేదు. కాపు రిజర్వేషన్ ఎత్తేసిన వారికి, కాపులను అడుగడుగునా అవమానిస్తున్న వారికి వత్తాసు పలుకుతారా అంటూ, నినాదాలు చేసారు. చివరకు ఈ సమావేశం రసాభాసగా ముగిసింది.