ఈ నెల 24 వతేదీన ఆయాసంతో చికిత్స నిమిత్తం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన 62 సంవత్సరాల వయస్సుగల తన భర్త వసంతరావు కనిపించడం లేదని అతని భార్య ధనలక్ష్మి, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్నుంచి ఆస్పత్రి వారిని అడుగుతుంటే తమకు ఏమీ తెలియదని చెబుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా వివరాలు తీసుకున్నారు , కానీ ఇంత వరకు సమాచారం లేదని ఆమె చెబుతున్నారు. తన భర్త ఎక్కడున్నాడన్నది తమకు అంతుబట్టడం లేదని ఆమె విలపిస్తున్నారు. వీరికి సంతానం లేదు. పైగా వసంతరావు సోదరుడు కూడా కొద్దిరోజుల క్రితమే చనిపోయారు. ఆయన దశదిన కర్మలు మొదలవడానికి ముందు వసంతరావు ఆయాసంతో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళారు. వసంతరావును పరిశీలించిన ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళమని చెప్పారు. దీంతో వసంతరావు, ధనలక్ష్మి ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడ ఇద్దరు వసంతరావును ఆస్పత్రి లోపలికి తీసుకువెళ్ళారు, ధనలక్ష్మిని బయటే ఉండమన్నారు.
అయితే లోసల తన భర్త చికిత్స పొందుతున్నాడని ఆమె బయటే సాయంత్రం వరకు వేచి ఉంది. ఆమెకు ఎవరూ ఏమీ వివరాలు చెప్పలేదు. అక్కడి వారిని అడిగితే చికిత్స చేస్తున్నారన్నట్లుగా చెప్పడం, ఇక్కడ వద్దు రేపు రండి అని చెప్పటంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. మరునాడూ ఆస్పత్రికి వెళ్ళితే వసంతరావు అనే వ్యక్తి లేరంటూ సమాధానం వచ్చేసరికి ఆమె భయాందోళనకు గురయింది. అప్పట్నుంచి భర్త కోసం ఎదురు చూస్తేనే ఉంది,. అటు ఆస్పత్రిలోని వారు ఏమీ చెప్పడం లేదు, ఇటు పోలీసులూ ఏమీ చెప్పడం లేదని, తన భర్తను వెతికి పెట్టండి అంటూ ఆమె ఇప్పుడు బహిరంగంగా ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భర్త ఆచూకీ కనిపించడం లేదని ఆమె ఆరోపిస్తున్నది. ఆస్పత్రికి వెళ్ళిన రోజున చాలాసేపటికి గాని సిబ్బంది స్పందించలేదని, చివరికి బతిమాలుకుంటే తన భర్తను వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకువెళ్ళారని, ఆ తరువాత నుంచి తన భర్త జాడలేదని వాపోతున్నది. బంధువు శంకరనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆస్పత్రి లో తమకు సమాధానం చెప్పడం లేదని, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.