మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్దా రాఘవరావు బుధవారం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు సమాచారం. వాణిజ్య వేత్తగా,
ప్రకాశం జిల్లాలో పలు సేవా కార్య క్రమాలు నిర్వహిస్తున్న శిద్దా రాఘవరావు టీడీపీ సీనియర్ నాయకుడు. అనతి కాలంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అతి సన్నిహితంగా, పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీలో టీడీపీ పోలిటిబ్యూరో సభ్యునిగా, జాతీయ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. శిద్దా రాజకీయ జీవితంలో 2009లో ఒంగోలు అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్తిగా పోటీచేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి చెందారు. శిద్దా కార్యదీక్షతను గుర్తించిన చంద్రబాబు నాయుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అలా అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన రాఘవరావు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి శాసనసభ స్థానం నుంచి ఎన్నికై రాష్ట్ర మంత్రిగా రహదారులు - భవనాల శాఖ, అటవీ శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు.

తదనంతరం 2019 ఎన్నికలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పో టీచేసి, వైసీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస రెడ్డి చేతిలో ఓటమి చెందారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా అందరికి ఆత్మీయ పలకరింపుతో ఆకట్టుకునే విలక్షణమైన శైలి శిద్దాకే సొంతం. జిల్లాలో మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి అధికార వైసిపీ కొంత మందిని లాక్కుంటుంది. నయానో - భయానో ప్రధానమైన నాయకులను పార్టీలోకి చేర్చుకునేందుకు రాష్ట్రస్థాయి నుంచి వ్యూహాలు ప్రారంభం అయ్యాయి. వీటిలో భాగంగా ప్రతిపక్ష నాయకుల పై ఒత్తిడి పెంచి వైసీపీ కండువాలు కప్పుతున్నారనే వాతావరణం ఉంది.

ఇదిలా ఉండగా అధికార పార్టీ శిద్దాపై దృష్టిసారించి, గత కొన్ని నెలలుగా ఆయనపై తీవ్ర ఒత్తిడి తీస్తున్నట్లు సమాచారం. శిద్దా రాఘవరావు అతని సోదరులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. కుటుంబ సభ్యుల నుండి తీవ్ర ఒత్తిడులు వచ్చినట్లు తెలిసింది. దీంతో శిద్దా రాఘవరావు తనయుడు శిద్దా సుధీర్ బాబును వైసీపీలోకి పంపుతారని ప్రచారం జరుగగా, శిద్దా చేరికకే అధికార పార్టీ ఒత్తిడి పెంచింది. శిద్దా రాఘవరావు ఆదివారం కుటుంబ సభ్యులతో చర్చించిన తరువాత ఈ నెల 10న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకోవడానికి మూహుర్తం నిర్ణయించినట్లు తెలిసింది. శిద్దా కుటుంబంలో రాజకీయంగా సంబంధాలు ఉన్న శిద్దా వెంకటేశ్వరరావు టీడీపీ హయాంలో జిల్లా మిల్క్ డైరీ చైర్మన్ గా వ్యవహరించి టీడీపీ ఓటమి అనంతరం బీజేపీ లో చేరారు. ఒత్తిడి నుంచి తప్పుకునేందుకు జిల్లా అధికార పార్టీ నాయకులతో చర్చించి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు శిద్దా సిద్ధం అయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read