"కర్ణాటకలో నివసిస్తున్న తెలుగు సోదర సోదరీమణులకు వినమ్రపూర్వక విన్నపం" సోదర సోదరీ మణులారా, ఎన్నో శతాబ్దాలుగా తెలుగు,కన్నడ ప్రజల మధ్య విడదీయరాని అన్యోన్య సోదర సంబంధం వుంది. బసవన్న సంఘ సంస్కరణోద్యమ గాలులు తెలుగు గడ్డపై కూడా వీచిన సంగతి మీకందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డ తర్వాత కూడా దశాబ్దాలుగా ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇక్కడి ప్రజల సంస్కృతీ సంప్రదాయాలతో మమేకమై ఈ రాష్ట్ర అభివృద్దికి ఇతోధిక కృషిచేసిన, చేస్తున్న మీ అందరినీ ముందుగా హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను.అలాగే గడిచిన 5 ఏళ్లుగా మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని 2013 ఎన్నికల్లో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి, నాకు కల్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను. 2013 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నూటికి 95 శాతం అమలు చేయడం ద్వారా ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. "అన్న భాగ్య" పథకం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువనున్న( BPL) కుటుంబాలకు కిలో ఒక్క రూపాయికే నెలకు 30 కేజీల బియ్యం ఇస్తామన్న వాగ్దానం నెరవేర్చాం.

8200 కోట్ల రూపాయలు వెచ్చించి రైతులకు రుణమాఫీ వాగ్దానాన్ని అమలు చేయడం జరిగింది. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కాలేజీ విద్యార్ధులకు లాప్ టాప్స్ అందజేశాం. రైతులకోసం సోలార్ పంపు సెట్లపై 75% సబ్సిడీని, డ్రిప్ ఇరిగేషన్ లో 100% సబ్సిడీని అమలు జరిపాం. రైతాంగానికి 2లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేశాం. "క్షీర భాగ్య" పధకం ద్వారా రైతులకు లీటరు పాలకు 4 రూపాయల చొప్పున సబ్సిడీ ఇచ్చాము. తద్వారా ఇబ్బడి ముబ్బడిగా పాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా, అలా ఉత్పత్తి అయిన పాలను స్కూలు పిల్లలకు ఉచితంగా సరఫరా చేయడం ద్వారా పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించే ప్రయత్నం చేశాం. 65 లక్షల మంది స్కూలు విద్యార్థులకు యూనిఫారాలు, టెక్స్ట్ పుస్తకాలు ఉచితంగా అందజేశాం. "విద్యా శ్రీ" పధకం కింద హాస్టళ్లలో సీటు లభించని విద్యార్ధులకు నెలకు 2000 రూపాయలు ఖర్చుల నిమిత్తం ఇవ్వటం జరిగింది. 2 లక్షల పైచిలుకు ఇరిగేషన్ పాండ్స్ తవ్వించాం. ఎస్.సి, ఎస్.టీ, బీసీ,మైనారిటీ వర్గాల ప్రజలు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డుల నుండి తీసుకున్న రుణాలను మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన విధంగా మాఫీ చేయడం జరిగింది. రెవిన్యూ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న పేదల ఇళ్లకు పట్టాలిచ్చి రెగ్యులరైజ్ చేశాం. ఇలా ఆనాడు మేము మా మేనిఫెస్టోలో ఇచ్చిన 165 వాగ్దానాలలో దాదాపు 158 వాగ్దానాలు నెరవేర్చగలిగామని సవినయంగా మనవి చేస్తున్నాను.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని, విభజన చట్టంలో పొందు పరిచిన హామీలను 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కి తెలుగు ప్రజలకు తీరని అన్యాయం, ద్రోహం చేసింది. ఆ విషయం నేను మీకు ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. గుండెల్లో దించిన బాకులాగా ఆ విషయం మిమ్ములను బాధిస్తుందన్న సంగతి నేను అర్ధం చేసుకోగలను. నాటి ప్రధాని పార్లమెంటులో ఇచ్చిన హామీలు, పార్లమెంటు చేసిన చట్టాలపై కూడా ఇసుమంత గౌరవం లేకుండా వ్యవహరిస్తూ బీజేపీ వారు ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చారు.

విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను నెరవేర్చటంలో మోడీ ప్రభుత్వ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం కారణంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు తీవ్రంగా నష్టపోయిన విషయం గమనార్హం. నాడు పార్లమెంటులో హడావుడి చేయటమే కాకుండా, 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో, ప్రచారంలో వాగ్దానం చేసి, స్వయంగా నరేంద్ర మోడీ గారు తిరుపతి సభలో ఏపీకి 10 సం.ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన చట్టంలోని అన్ని హామీలను తు చ తప్పకుండా నెరవేరుస్తామని ఘంటాపథంగా చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత దారుణంగా మోసం చేసిన విషయాన్ని మీరు ఎన్నటికీ మరిచిపోలేరు. దానివల్ల ఏపీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అర్ధం చేసుకోవటమేగాక, ఈ విషయంలో బీజేపీ వారు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా పలు సందర్భాలలో వ్యవహరించిన తీరుతో మీకు కలిగిన ఆవేదనని, ఆక్రోశాన్ని ఓ ప్రజాహితం కోరుకునే రాజకీయవేత్తగా నేను మీతో సరి సమానంగా పంచు కుంటున్నాను. 2016 జూన్ 9 వ తేదీన శ్రీమతి సోనియా గాంధీ గారి అధ్యక్షతన జరిగిన 9 రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని తీర్మానం చేశాం. ఎంతో ఆర్తితో, చిత్తశుద్ధితో ఆ తీర్మానం చేసిన ఆ సమావేశంలో నేను కూడా భాగస్వామిని అన్న విషయం మీకు సవినయంగా మనవి చేస్తున్నాను.

చేయటానికి అవకాశం ఉండి కూడా ఇబ్బందుల్లో వున్న, ఆర్ధిక లోటుతో సతమతమవుతున్న ఏపీని ఆదుకోకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎగనామం పెట్టిన బీజేపీకి తెలుగు ప్రజలంతా తగిన రీతిలో బుద్ధి చెప్పగలరని ఆశిస్తున్నాను. ఇదిలా ఉండగా పేరులో 'సెక్యులర్' అని ఉన్నా ప్రజా వ్యతిరేక, ఉన్మాద బీజేపీతో కుమ్మక్కైన, బీజేపీకి 'బి' టీమ్ గా పనిచేస్తున్న జే.డి(ఎస్) వారి నిజ స్వరూపాన్ని గ్రహించి వారికీ తగిన బుద్ధి చెప్పాలని కోరుతున్నాను. ఆ విజ్ఞత, చైతన్యం మన రాష్ట్రంలో ఉన్న తెలుగువారికి ఉందన్న విషయం నాకు తెలుసు. ఓ పక్క అవినీతి వ్యతిరేక జపం చేస్తూ మరో పక్క మైనింగ్ మాఫియా గాలి జనార్ధన్ రెడ్డి బృందంతో కర్నాటక అసెంబ్లీని నింపజూస్తున్న బీజేపీని ఎలా అర్ధం చేసుకోవాలో, ఎక్కడ ఉంచాలో మీకు తెలుసు. మొత్తంగా దేశంలో అరాచక పాలన సాగిస్తూ, ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతూ అధోగతి పాలు చేస్తున్న బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి కర్ణాటకలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు ఈ ఎన్నికల్లో మరిచిపోలేని తీరున గుణపాఠం నేర్పాలని వినమ్రంగా కోరుతున్నాను.

గడిచిన 5 ఏళ్ల పాటు చిత్తశుద్ధితో కృషి చేసి మీకు ఎలా సుపరిపాలనను, అభివృద్ధి, సంక్షేమాలను అందించామో విజ్ఞులైన మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత ఐదేళ్ల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, రైతులు బడుగు బలహీన వర్గాలపై ప్రత్యేక శ్రద్ధను కొనసాగిస్తూనే...2018 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్య, ఐటీ రంగం, సుపరిపాలనపై దృష్టి సారించి ఆకాంక్షాయుత వర్గాల( aspirational sections) ఆశలను, ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రతిన బూనుతున్నాము. మళ్లీ ఈ ఎన్నికల్లో కూడా ఆశీర్వదించి రాబోయే ఐదేళ్లు కూడా మీకు మరింతగా సేవ చేసే సదవకాశాన్ని కాంగ్రెస్ పార్టీకి, నాకు కల్పించవలసిందిగా వేడుకుంటున్నాను."

Advertisements

Advertisements

Latest Articles

Most Read